గడ్డి కేంద్రాల కోసం ఆందోళన
గడ్డి కేంద్రాల కోసం ఆందోళన
Published Wed, Apr 26 2017 11:43 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
- పశువులతో మడకశిర తహసీల్దార్ కార్యాలయం ముట్టడి
- పాల్గొన్న పీసీసీ చీఫ్ రఘువీరా
మడకశిర: గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేసి, పశుసంపదను కాపాడాలని డిమాండ్ చేస్తూ పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం వందలాది పశువులతో మడకశిర తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఈ ఆందోళన కొనసాగింది. పశువులను తహసీల్దార్ ఛాంబర్‌లోకి తోలి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి పశువుల హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటున్నారని తప్పా.. పశువుల కష్టం మాత్రం ఆయనకు తెలియడం లేదన్నారు. మన రాష్ట్రంలో గడ్డి కొరత తీవ్రంగా ఉన్న సమయంలో ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని మంత్రి మండలి సమావేశంలో నిర్ణయించడం బాధాకరమన్నారు. డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఆ కేంద్రాలకు వచ్చే రైతులందరికీ తమ పార్టీ తరఫున ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తామన్నారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్ మాట్లాడుతూ గడ్డి కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. «ధర్నాలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురంగల నాగరాజు, ఏ బ్లాక్ అధ్యక్షుడు దాసరపల్లి దొడ్డయ్య, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్లు ప్రభాకర్‌రెడ్డి, నరసింహమూర్తి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరసింహమూర్తి, పట్టణ అధ్యక్షుడు నాగేంద్ర, మండల అధ్యక్షుడు మంజునాథ్, గుడిబండ మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement