రాజధాని డిజైన్ మళ్లీ మొదటికి..!
► జపాన్ సంస్థ విమర్శలతో సర్కారు పునరాలోచన
► డిజైన్‌ను పూర్తిగా మార్చాలని నిర్ణయించిన సీఎం
► మళ్లీ మకి అసోసియేట్స్‌కే బాధ్యత
విజయవాడ: రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం కోసం జపాన్ రూపొందించిన డిజైన్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందనే విమర్శలతో ప్రభుత్వం వెనకడుగు వేసింది. జపాన్ కంపెనీతోనే మళ్లీ కొత్తగా డిజైన్ తయారు చేయించాలని నిర్ణయించింది. డిజైన్ వ్యవహారం మళ్లీ మొదటికే రావడంతో 2017 ఏప్రిల్ నాటికి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించి 2018 కల్లా నిర్మాణం పూర్తయ్యేలా చూడాలనే ప్రభుత్వ ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఈ డిజైన్ కోసం సీఆర్‌డీఏ మూడు నెలల పాటు కసరత్తు చేసింది. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌ల మధ్య పోటీ పెట్టింది. 900 ఎకరాల్లో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం, రాజ్‌భవన్, శాఖాధిపతుల కార్యాలయాలు, వీఐపీల నివాసాలు, ఉద్యోగుల క్వార్టర్లు, ఆయా ప్రదేశాల్లో గ్రీనరీ (పచ్చదనం) ఉండేలా అంతర్జాతీయ స్థాయిలో డిజైన్ చేయాలని సూచించింది.
అసెంబ్లీ, హైకోర్టు భవనాలను ఐకానిక్ భవనాలుగా అత్యద్భుతంగా ఉండాలని సచివాలయం కూడా అదేస్థాయిలో ఉండాలని పేర్కొంది. ఉత్తమ డిజైన్ ఎంపికకు ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ క్రిస్టోఫర్ బెనిగర్ నేతృత్వంలో దేశ, విదేశీ ఆర్కిటెక్ట్‌లతో ఒక జ్యూరీని ఏర్పాటు చేసింది. పలు జాతీయ, అంతర్జాతీయ ఆర్కిటెక్ట్‌లు డిజైన్లు రూపొందించగా అంతిమంగా జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్, లండన్‌కు చెందిన రిచర్డ్ రోజర్స్, భారత్‌కు చెందిన వాస్తు శిల్ప కన్సల్టెంట్స్ డిజైన్‌లను తుదిపోటీకి ఎంపిక చేసింది. గత నెలలో ఈ మూడు డిజైన్లను పరిశీలించిన జ్యూరీ చివరకు జపాన్‌కు చెందిన మకి అసోసియేట్స్ డిజైన్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే ఈ ఎంపిక ప్రక్రియ కొనసాగగా ఆ డిజైన్‌ను ఆమోదిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
అప్పుడు అత్యద్భుతం అన్న సీఎం
ప్రభుత్వం, సీఆర్‌డీఏ, ఆర్కిటెక్ట్‌లు మకి డిజైన్ అద్భుతంగా ఉందన్నా వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. డిజైన్‌లోని అసెంబ్లీ భవనాలు పొగగొట్టాల్లా ఉండడం, అదే తరహా అసెంబ్లీ భవనం చండీగఢ్‌లో ఉండడంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక్కడి డిజైన్లనే కాపీ కొట్టి జపాన్ కంపెనీ అంతర్జాతీయ స్థాయి అన్నట్టు చూపించిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచలో పడింది. ఈ డిజైన్‌కు మకి అసోసియేట్స్‌కు రూ.97.5 లక్షలు సీఆర్‌డీఏ చెల్లించింది. ఎంపిక తతంగానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. తీరా అది తుస్సుమనడంతో డిజైన్‌ను మార్చడానికి కసరత్తు చేస్తోంది. అప్పట్లో మకి డిజైన్ అద్భుతమని పొగిడిన చంద్రబాబు సోమవారం మీడియా సమావేశంలో.. జపాన్ డిజైన్ ఫైనల్ కాదని మనకు కావాల్సిన విధంగా ఆ కంపెనీతో డిజైన్ చేయిస్తామంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు సోమవారం మకి అసోసియేట్స్‌తో సమావేశమై అసెంబ్లీ భవన డిజైన్‌ను పూర్తిగా మార్చాలని, హైకోర్టు డిజైన్‌లోనూ మార్పులు చేయాలని సూచించినట్లు తెలిసింది.