ఏపీ ఎంసెట్ యథాతథం
♦ యథావిధిగా పరీక్షలు..మంత్రులు గంటా, కామినేని వెల్లడి
♦ కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
సాక్షి, హైదరాబాద్: ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ మెడికల్ కామన్ ఎంట్రన్సు టెస్టు (ఎంసెట్)-2016 శుక్రవారం (29 ఏప్రిల్) యథాతథంగా జరగనుందని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన జారీచేశారు. మరోవైపు షెడ్యూల్ ప్రకటించి ఉన్నందున ఎంసెట్ పరీక్షలు యధావిధిగా జరుగుతాయని, జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణపై సుప్రీంకోర్టు ఉత్తర్వులను క్షుణ్నంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో ఏపీ ఎంసెట్‌ను యథావిధిగా నిర్వహించడానికి కాకినాడ జేఎన్‌టీయూ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది.
శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెడికల్, అగ్రికల్చర్ విభాగాల పరీక్షలు యథాతథంగా జరుగుతాయని ఎంసెట్ చైర్మన్ ప్రొఫెసర్ వీఎస్‌ఎస్ కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు పేర్కొన్నారు. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలో 329, హైదరాబాద్‌లో 26 మొత్తం 355 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. మెడికల్, అగ్రికల్చర్ విభాగానికి ఏపీలో 165, తెలంగాణలో 26 కేంద్రాలు ఏర్పాటుచేశారు.
పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్‌సూపరింటెండెంట్లు తదితర అధికారులు కాకుండా పర్యవేక్షణకు సంబంధించి మొత్తం 713 మందిని పరిశీలకులు, ప్రత్యేక అబ్జర్వర్లు, ఎన్‌ఫోర్సుమెంటు అధికారులుగా నియమించారు. అభ్యర్ధులు గంట ముందుగా పరీక్ష హాలుకు చేరుకోవాలని, పరీక్ష ప్రారంభ సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.
ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది
బాలాజీచెరువు (కాకినాడ) : శుక్రవారం జరగనున్న ఏపీ ఎంసెట్‌కు 2,92,507 మంది హాజరుకానున్నారని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబు తెలిపారు. ఆయన గురువారం ఇక్కడ మాట్లాడుతూ ఇంజనీరింగ్‌లో 1,89,273 మంది, మెడికల్‌లో 1,03,234 మంది ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఏపీ ఎంసెట్‌కు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేశారని వివరించారు. ఎంసెట్ కేంద్రాల వద్ద కంప్యూటర్ సెంటర్లు, జిరాక్సు సెంటర్లు హోటళ్లను మూసివేయించేలా ఆదేశాలు జారీచేశామని, అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారని తెలిపారు.
ఏపీఎస్‌ఆర్‌టీసీ అదనపు బస్సులు నడపడంతోపాటు ఆయా విద్యార్థులకు ఉచిత ప్రయాణానికి అనుమతించిందని వివరించారు. పరీక్ష కేంద్రాల్లోకి స్మార్ట్‌ఫోన్లు, చేతివాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని సాయిబాబు స్పష్టంచేశారు. శుక్రవారం సాయంత్రం వెబ్‌సైట్‌లో ప్రిలిమినరీ కీ ఉంచుతామని, అభ్యంతరాలు ఉంటే మే 4 సాయంత్రంలోగా తెలపవచ్చని, మే 9న ఫైనల్ కీతో పాటు ర్యాంకులు వెల్లడిస్తామని పేర్కొన్నారు.