- కేసుల భయంతోనే చంద్రబాబు నిలదీయడం లేదు
- వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజం
- వైఎస్ జగన్ జల దీక్ష ఏర్పాట్ల పరిశీలన
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ ఎడారిగా మారుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, పార్టీ కర్నూలు జిల్లా అదనపు పరిశీలకులు రవీంద్రనాథ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకపోతే రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు కనీసం తాగునీరు కూడా లభించే పరిస్థితి ఉండదని అభిప్రాయపడ్డారు. అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో కర్నూలు నగరంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టనున్న జలదీక్ష స్థలిని పార్టీ నాయకులు శనివారం పరిశీలించారు. అంతకుముందు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అటు గోదావరి, ఇటు కృష్ణాలపై తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ర్టంలో రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు తీవ్రంగా నష్టపోనున్నాయన్నారు. ఈ ప్రాంతాల్లో వలసలు మరింత పెరిగే ప్రమాదం ఉందని రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. అక్రమ ప్రాజెక్టుల వ్యవహారాన్ని కోర్టుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్నారు.
కేసులు, కాసుల భయంతోనే..
కేసులు, కాసుల భయంతో తెలంగాణ అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు నిలదీయడం లేదని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ పోలీసులు అరెస్టు చేయకుండా ఉండేందుకు రాత్రి హైదరాబాద్‌లో, పగలు విజయవాడలో ఆయన ఉంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ దీక్ష ప్రకటన తర్వాతే అక్రమ ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని, మంత్రి దేవినేని ప్రాజెక్టులను సందర్శిస్తున్నారని ఎమ్మెల్యేలు ఐజయ్య, అంజద్ బాషా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, మురళీకృష్ణ, నాయకులు తెర్నేకల్లు సురేందర్‌రెడ్డి, నరసింహయాదవ్, రాంపుల్లయ్య యాదవ్, మద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
అక్రమ ప్రాజెక్టులతో ఏపీ ఎడారే
Published Sun, May 15 2016 4:09 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement