దీపం దైవ స్వరూపం
కడప కల్చరల్:
దీపం మానవ లోకానికి వెలుగునిచ్చే దైవ స్వరూపమని చిన్మయమిషన్ ఆచార్యులు నిర్మలానంద సరస్వతి పేర్కొన్నారు. చిన్మయమిషన్ కడపశాఖ ఆచార్యులు స్వామి శౌనకచైతన్య ఆధ్వర్యంలో ఆరు రోజులుగా స్థానిక మున్సిపల్ మైదానంలో జరుగుతున్న కార్తీక దీపోత్సవ సభకు శనివారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దీపాన్ని జ్ఞాన జ్యోతిగా భావించాలని, ప్రాపంచిక జ్ఞానానికి చివరి దశ ఆధ్యాత్మికమేనని తెలిపారు. మానవుడు ఉత్తమ గుణాలతో ఆత్మజ్యోతిగా శివజ్యోతిని చేరుకునేందుకు సత్కర్మల ద్వారా ప్రయత్నించాలని సూచించారు.
పరుచుకున్న వెలుగు – ఈ సందర్భఃగా వేదికపై శివలింగానికి విశేష అభిషేకాలు, అలంకారం అనంతరం స్వామిని నిర్మలానంద ప్రధాన జ్యోతిని వెలిగించారు. వెంటనే భక్తులు కూడా దీపాలను వెలిగించి శివనామ స్మరణ చేశారు. నిర్వాహకులు ముల్లంగి ప్రసాద్, ఎలిశెట్టి శివకుమార్, చింతకుంట పుల్లయ్య, మాకం నాగరాజు, ఆనంద్ తదితరులు భక్తులకు ఎలాంటి అసౌక్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.