అప్పు పుట్టక.. ఎలా నాగలి నడక
Published Sat, Jun 17 2017 1:24 AM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : బ్యాంకుల నుంచి అప్పు పుట్టడం లేదు. వెబ్‌ల్యాండ్‌కు బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానించటంతో విత్తనాలపై రాయితీ అందటం లేదు. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉండగా.. ఖరీఫ్ సీజన్ ఆరంభమై 10 రోజులు కావస్తున్నా ఒక్కరికైనా పైసా రుణం దక్కలేదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితుల్లో ఖరీఫ్ సాగును ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక వారంతా సతమతమవుతున్నారు.
జిల్లాలోని కౌలు రైతులను పెట్టుబడి సమస్య వెంటాడుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సాగును ముందస్తుగా చేపట్టామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. జూన్ 1న కాలువలకు గోదావరి జలాలు విడుదల చేశారు. తంటాలు పడి నారుమడులు పోసిన కౌలు రైతులు పెట్టుబడికి అప్పులిచ్చే వారికోసం వెతుకులాడే పనిలో నిమగ్నమయ్యారు. డెల్టాలో 80 శాతం మంది కౌలు రైతులే వరి సాగు చేస్తున్నారు. జిల్లాలో మూడు లక్షల మంది కౌలు రైతులు ఉండగా.. వారిలో అధిక శాతం మంది డెల్టాలోనే ఉన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 5.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. నెల రోజుల క్రితమే రబీ పం టను విక్రయించగా వచ్చిన సొమ్ము గత ఖరీఫ్, రబీ పంటల కోసం చేసిన అప్పులు తీర్చడానికి సరిపోయింది. దీంతో తొలకరి పంటకు సొమ్ములందక బిత్తరచూపులు చూస్తున్నారు. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు అప్పులు కూడా దొరకడం కష్టంగా మారింది. ధాన్యాన్ని లెవీగా సేకరించే విధానం అమల్లో ఉన్నప్పుడు మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు కౌలు రైతులకు అప్పులు ఇచ్చేవారు. కోతలు పూర్తయ్యాక వారే ధాన్యం కొని.. అప్పుపోగా మిగిలిన సొమ్మును వారి చేతిలో పెట్టేవారు. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ధాన్యం సేకరిస్తుండటంతో మిల్లర్లు, కమీషన్ వ్యాపారులు అప్పులివ్వడం మానేశారు. ప్రైవే టు వ్యాపారులెవరైనా అప్పులిచ్చినా నూటికి రూ.2 నుంచి రూ.5 వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. ఎరువులు, పురుగు మందుల్ని అరువు పద్ధతిన కొనుగోలు చేయాల్సి రావడంతో కొందరు డీలర్లు నకిలీ, నాణ్యత లేనివాటిని అంటగడుతున్నారు.
లక్ష్యానికి దూరంగా రుణాలు
ఈ ఏడాది రూ.6,526 కోట్లను రైతులకు రుణా లుగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా.. అం దులో 10 శాతం కౌలు రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. 80 శాతం పైగా పొలాలను సాగుచేసే కౌలు రైతులకు 10 శాతమే ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం చెబుతోంది. అదికూడా వారికి దక్కడం లేదు. గత ఏడాది రూ.5,176 కోట్లను 3.98 లక్షల మంది రైతులకు రుణాలుగా ఇచ్చారు. ఇందులో వ్యక్తిగత, రైతుమిత్ర, జేఎల్‌జీ గ్రూపుల ద్వారా కౌలు రైతులకు దక్కింది కేవలం రూ.21 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రుణంలో 0.4 శాతం కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.3,300 కోట్లను బ్యాంకర్లు రుణాలుగా ఇవ్వాల్సి ఉండగా.. అవి భూ యజ మానులకు దక్కుతున్నాయి తప్ప కౌలు రైతుకు చేరడం లేదు. ఒక సర్వే నంబర్‌పై ఒకరికే రుణం ఇస్తామంటున్న బ్యాంకర్లు క్షేత్రస్థాయిలో ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరికి రుణం ఇవ్వాలనే అంశాన్ని పట్టించుకోవడం లేదు. మరోవైపు రుణం విషయంలో బ్యాంకులకు ప్రభుత్వం కూడా హామీ ఇవ్వలేకపోతోంది.
రుణమాఫీలోనూ అన్యాయమే
రుణమాఫీ విషయంలోనూ కౌలు రైతులకు అన్యాయం జరిగింది. జిల్లాలో కౌలు రైతులకు రూ.165 కోట్లు మాఫీ కావాల్సి ఉండగా.. ఈ మూడేళ్లలో కేవలం రూ.40 కోట్లు మాత్రమే మాఫీ అయ్యింది. రుణమాఫీ పథకానికి అర్హులైన రైతులను వడ్డీల భారం వేధిస్తోంది. ఆ మొత్తాన్ని రైతులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో వారికి కొత్త రుణాలు ఇవ్వడం లేదు.
చేటు తెచ్చిన బయోమెట్రిక్ విధానం
తాజాగా రుణాల మంజూరు కోసం ప్రభుత్వం బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది. దీనిని వెబ్‌ల్యాండ్‌కు అనుసంధానం చేశారు. ఇది సరిగా పనిచేయకపోవడంతో వ్యవసాయ శాఖ సకాలంలో దీనిని అమలు చేయలేకపోతోంది. వెబ్‌ల్యాండ్‌లో పేరు నమోదైన భూ యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే వెబ్‌ల్యాండ్ ఓపెన్ అవుతోంది. అందువల్ల రుణాలు భూ యజమానులకే అందుతున్నాయి. కౌలు రైతులకు రుణార్హత గుర్తింపు కార్డులిచ్చినా.. వాటిని బయోమెట్రిక్ విధానానికి అనుసంధానం చేయలేదు. ఫలితంగా విత్తనాల కొనుగోలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పొందలేక కౌలు రైతు సతమతమవుతున్నాడు. వరి విత్తనాలపై కిలోకు రూ.ఐదు చొప్పున సబ్సిడీ ఇస్తుండగా.. 30 కిలోలకు రూ.150 మాత్రమే దక్కుతోంది. ఈ సొమ్ము వెబ్‌ల్యాండ్, ఇతర పనుల మీద తిరగడానికే సరిపోతోంది. వేసవిలో జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి పచ్చిరొట్ట విత్తనాలపై 75 శాతం సబ్సిడీ ఇచ్చినా కౌలు రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. 2008లో రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం.. పంట రుణాలకు సంబంధించి రూ.లక్ష వరకూ ఎలాంటి హామీ అవసరం లేదు. కౌలు రైతు లేదా రైతు నుంచి వ్యక్తిగత ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లక్ష వరకు వడ్డీ లేని రుణం రైతుకు అందితే ఏడాదికి రూ.24 వేల వరకూ వడ్డీ రూపంలో లబ్ధి చేకూరుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కౌలు రైతులకు రుణాలు అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Advertisement