అదృష్టవంతులే అర్హులు | Are feeling lucky | Sakshi
Sakshi News home page

అదృష్టవంతులే అర్హులు

Published Thu, Sep 1 2016 11:20 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

లాటరీ పద్దతి ద్వారా మైనారిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న దృశ్యం - Sakshi

లాటరీ పద్దతి ద్వారా మైనారిటీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న దృశ్యం

సాక్షి,సిటీ  బ్యూరో: బ్యాంక్‌ లింకే జీ సబ్సిడీ రుణం పొందాలంటే అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే. మైనారిటీ నిరుద్యోగ అభ్యర్థులకు బ్యాంక్‌ లింకేజీ రుణాలు మంజూరు చేసేందుకు గాను జిల్లా యంత్రాంగం వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు కాన్సెంట్‌ లేఖలు ఇచ్చినా లాటరీ పద్దతిలో లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం విస్మయానికి గురిచేస్తోంది. గురువారం జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో 2015–16 ఆర్థిక సంవత్సరానికి గాను స్వయం ఉపాధి కల్పన పథకం కేటగిరి–2 కింద లబ్ధిదారులు ఎంపికకు లాటరీ నిర్వహించారు.

ఎనిమిది నెలల క్రితం బ్యాంక్‌ లింకేజీ రుణాల కోసం దరఖాస్తులు అహ్వానించడంతో సుమారు 8,759 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ కేటగిరి–2 కింద రూ.1 లక్ష నుంచి 2 లక్షల వరకు ఆర్ధిక సహాయం కోసం వచ్చిన అర్హుల దరఖాస్తులను గుర్తించి బ్యాంకులకు సిఫార్సులు చేసింది. ఈ కేటగిరిలో యూనిట్‌ ధరలో సుమారు 70 శాతం సబ్సిడీగా అందజేయనున్నారు. బ్యాంకులు దరఖాస్తులను పరిశీలించి సుమారు 1,066 మంది అభ్యర్ధులకు రుణాలు అందించేందుకు సముఖత వ్యక్తం చేయడంతో పాటు లేఖను సైతం జారీ చేశారు.

అయితే జిల్లా సెలెక్షన్‌ కమిటీ వారిలో కేవలం 367 మంది అభ్యర్ధులను మాత్రమే లాటరీ పద్దతిలో ఎంపిక చేసి చేతులు దులుపుకుంది.  ఇదిలా ఉండగా ఎంపికైన వారిలో సెంట్రల్‌ జోన్‌కు సంబంధించిన196 మంది కాగా,  సౌత్‌జోన్‌కు  చెందిన వారు 164 మంది. నార్త్‌జోన్‌కు సంబంధించి 7గురు అభ్యర్ధులు ఉన్నారు. మొత్తం అభ్యర్ధుల్లో అత్యధికంగా బహదూర్‌ పూరా  నుంచి ఎంపిక కాగా,  అత్యల్పంగా> తిరుమలగిరి మండలం నుంచి  ఎంపికైనట్లు సమాచారం.

లాటరీ పద్దతి ద్వారా జరిగిన అభ్యర్ధుల ఎంపిక కార్యక్రమానికి ఇన్‌చార్జి ఏజేసీ ఆశోక్‌ కుమార్‌ అధ్యక్షత వహించగా,  మైనారిటీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీధర్, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఖాజా మొయినోద్దీన్,  వికలాంగుల శాఖ ఎడీ సుదర్శన్, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ అశ్రిత, ఎల్డీయం నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.



 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement