అటకెక్కిన ఆరోగ్య రక్ష
► ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’పై అధికారుల నిర్లక్ష్యం
► బాలల వైద్యసేవలకు మంగళం
జిల్లాలోని పాఠశాలలు : 3,865
మొత్తం విద్యార్థులు : 3,42,604
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు జబ్బు చేస్తే మంచి ఆస్పత్రుల్లో చూపించే ఆర్థిక స్తోమత వారి తల్లిదండ్రులకు లేదు. ఇలాంటి వారికి వైద్యసేవలు అందించాలన్న ఉద్దేశంతో 2010 నవంబర్ 10న ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించి..అవసరమైతే మందులు, చికిత్స అందించాలనేది ఈ పథకం ప్రధానోద్దేశం. దీంతోపాటు చిన్నారుల విద్యా ప్రగతిపైనా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. పథకం ఉద్దేశం మంచిదే అయినా..దీని అమలులో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 3,865 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3,42,604 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధి కోసం వలస వెళ్లే తల్లిదండ్రులు పిల్లల ఆలనా పాలనా సరిగా చూసుకోలేరు. అలాంటి పిల్లలు అపరిశుభ్ర వాతావరణంలో ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించలేరు. ఇలాంటి పిల్లలు సాధారణంగా అనారోగ్యం పాలవుతుంటారు. దీనివల్ల పాఠశాలలకు సరిగా హాజరుకాలేరు. ఈ నేపథ్యంలో వారికి వైద్య సేవలు అందించడంతో పాటు పాఠశాలల్లో హాజరు శాతం పెంచేందుకు ప్రభుత్వం ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష’ పథకాన్ని అమలు చేస్తోంది. దీని కింద ప్రత్యేకంగా ఆరోగ్యరక్ష కార్డులు జారీ చేస్తోంది.
1 నుంచి 10వ తరగతి వరకు ప్రతినెలా ప్రతి విద్యార్థి ఆరోగ్య వివరాలు అందులో నమోదు చేయాలి. ప్రారంభంలో ఆర్భాటంగా కార్డులు అందజేసిన అధికారులు అనంతరం వాటి గురించి పట్టించుకోలేదు. మొదట్లో అడపాదడపా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఇప్పడేమో ఆస్పత్రులకే పరిమితమయ్యారు. ఇక ప్రత్యేక కమిటీలు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ప్రస్తుతం విద్యార్థులు జబ్బు బారిన పడితే తల్లిదండ్రులు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించాల్సి వస్తోంది.
కమిటీ విధులు ఇవీ..
ఆరోగ్య రక్ష పథకం ఆషామాషీగా ఏర్పాటు చేయలేదు. మండల స్థాయిలో ఎంపీడీఓ చైర్మన్‌గా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, ఎంఈఓలు సభ్యులుగా ఓ కమిటీని నియమించారు.
– ఈ కమిటీ షెడ్యూల్ ప్రకారం ప్రతి పాఠశాలనూ సందర్శించి, పిల్లలకు వైద్య పరీక్షలు సరిగా జరిగేలా చూడాలి .
–పిల్లలకు సంబంధించిన ఆరోగ్య వివరాలు కార్డులో నమోదు చేయాలి.
– ప్రతి మంగళవారం ఆరోగ్య దినంగా పాటించేలా చూడాలి. ప్రత్యేక చికిత్స అవసరమైన విద్యార్థులను రెఫరల్ ఆస్పత్రికి తరలించాలి.
– వైద్య పరీక్షల విషయంలో ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు కూడా బాధ్యత తీసుకుని సమీక్షించాలి.
– పాఠశాలలో ఆరోగ్య పరీక్షలు జరిగేటప్పడు తల్లిదండ్రులను కూడా పిలిపించి, విద్యార్థికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి.
– తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, గ్రేడుల వివరాలు రికార్డుల్లో నమోదయ్యాయో, లేదో పరిశీలించాలి.
ఏ పరీక్షలూ చేయలేదు
మా వద్ద ఆరోగ్యరక్ష కార్డులు ఉన్నాయి. అయితే.. మాకు ఎలాంటి పరీక్షలూ చేయలేదు. తలనొప్పో.. జర్వమో వస్తే టౌన్‌కు పోయి బాగు చేయించుకుంటున్నాం.
– నారాయణస్వామి, 5వ తరగతి, బ్రహ్మదేవమర్రి, ముదిగుబ్బ మండలం
ఒక్కనాడూ డాక్టర్ రాలేదు
స్కూళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు ఎవరూ మా స్కూల్‌కు రాలేదు. ఇప్పటికైనా వైద్యులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలి. టౌన్‌కు పోయి వైద్యం చేయించాలంటే మా వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు.
– ప్రభాకర్, బ్రహ్మదేవమర్రి, ముదిగుబ్బ మండలం