అ‘మృత’ హస్తం | amritha hastham flop of maintainance | Sakshi
Sakshi News home page

అ‘మృత’ హస్తం

Published Wed, Jun 28 2017 10:07 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

అ‘మృత’ హస్తం - Sakshi

అ‘మృత’ హస్తం

జూలై 1 నుంచి ఏడు ప్రాజెక్టుల్లో పథకం అమలు
– ఒక్క కేంద్రానికీ చేరని వంట పాత్రలు
– లబోదిబోమంటున్న అంగన్‌వాడీ కార్యకర్తలు
- ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు
– శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత సొంత జిల్లాలోనే ఈ దుస్థితి  


ఇది అనంతపురంలోని ఓబుళదేవరనగర్‌–1 అంగన్‌వాడీ కేంద్రంలోని వంట గది. ఇక్కడ మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య పిల్లలు 16 మంది, గర్భిణులు 22 మంది, బాలింతలు ఏడుగురున్నారు. ‘అన్న అమృతహస్తం’ పథకం ప్రారంభమైతే మొత్తం 45 మందికీ కేంద్రంలోనే వంట చేసి ఆహారం అందించాలి. కానీ ఇక్కడ వంట చేయడానికి పాత్రలు లేవు. చిన్న పాటి కుక్కర్, గిన్నె మాత్రమే ఉన్నాయి. ఆహారం ఎలా వండి వడ్డించాలో అర్థం కాని పరిస్థితి.

ఇది అనంతపురంలోని ఓబుళదేవరనగర్‌–2 అంగన్‌వాడీ కేంద్రంలోని వంట గది. ఇక్కడ పిల్లలు 18 మంది, గర్భిణులు 17 మంది, బాలింతలు 15 మంది ఉన్నారు. మొత్తంగా 42 మందికి అన్నం వండి వడ్డించాలి. ఇక్కడా ఇదే సమస్య. గతంలో పంపిణీ చేసిన పెద్ద గిన్నె ఉన్నా... కుక్కర్, గ్లాసులు, ప్లేట్లు లేవు.

అనంతపురం టౌన్‌ : తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుచావండి అన్నట్లుంది సర్కారు తీరు. వంట వండేందుకు పాత్రల్లేవ్‌.. అన్నం వడ్డించేందుకు కంచాల్లేవ్‌.. నీళ్లు తాగేందుకు గ్లాసుల్లేవ్‌.. ఇలా అన్నీ సమస్యలే. కానీ ‘అన్న అమృతహస్తం’ మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారుల ఆదేశం. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.

గతంలో ఇలా..
ఒక్కో అంగన్‌వాడీ కేంద్రంలో కనీసం 10 నుంచి 20 మంది బాలింతలు, గర్భిణులు ఉంటారు. వారికి పోషకాహారం అందించి రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి నెలా ఇంటికి రేషన్‌ అందించేవారు. నెలకు 16 గుడ్లు, కిలో కంది పప్పు, మూడు కిలోల బియ్యం, 456 గ్రాముల నూనె ఇచ్చే వారు. ఈ పౌష్టికాహారం సక్రమంగా వినియోగించడం లేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో కేంద్రాల్లోనే భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.  

జూలై 1 నుంచి ‘అన్న అమృతహస్తం’ ప్రారంభం  
జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్‌) కింద 17 ప్రాజెక్టులుండగా ఇప్పటికే పది ప్రాజెక్టుల్లో ‘అన్న అమృతహస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా ఏడు ప్రాజెక్టుల్లో జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అన్న తేడా లేకుండా అందరికీ ఆయా కేంద్రాల్లోనే భోజనం అందించాలని నిబంధన విధించారు. గతంలో టేక్‌ హోం రేషన్‌ పేరుతో అందించే పౌష్టికాహారానికి స్వస్తి పలికి సంపూర్ణ పోషకాలు ఉండే భోజనం వడ్డించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, రోజుకో గుడ్డు అందిస్తారు. ఒక రోజు సాంబారు, ఒక రోజు రసం, ఒక రోజు ఆకుకూరను మెనూలో చేర్చారు.  

తరచి చూస్తే అన్నీ సమస్యలే
పథకం మంచిదే అయినా ఆచరణలో మాత్రం ‘ఆదిలోనే హంసపాదు’ ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ ఖర్చులు కూడా రాకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. చాలాచోట్ల మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం చెల్లించే అద్దెకు సరైన భవనాలు లభించక చిన్న గదుల్లోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇక పోషకాహారంలో నాణ్యత కొరవడుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చౌక దుకాణాల నుంచి వచ్చే బియ్యం, పప్పు, గుడ్డు నిర్దేశిత బరువు కన్నా తక్కువగా ఉంటున్నాయి. అవీ అరకొరే అందుతున్నాయి. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు వంట చేసేందుకు కట్టెల ఖర్చు కింద నెలకు రూ.250 చెల్లిస్తున్నారు. ఇదెంత మాత్రం సరిపోవడం లేదని సిబ్బంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు కొత్తగా ‘అన్నా అమృతహస్తం’ కింద గర్భిణులు, బాలింతకలకు కూడా వండి పెట్టాలంటే తమకు తలకుమించిన భారమవుతుందని సిబ్బంది చెబుతున్నారు.

మంత్రికి చెప్పినా ఫలితం శూన్యం
మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగైనా పథకాన్ని అనుకున్న సమయానికే కచ్చితంగా అమలు చేయాలని మంత్రి చెబుతున్నారనీ, అందువల్ల కనీసం వంట పాత్రలనైనా సరఫరా చేయాలని అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. అన్న అమృతహస్తం పథకం అమలు చేసేందుకు మూడు నెలల బిల్లులు అడ్వాన్స్‌గా చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

‘అన్న అమృతహస్తం’ అమలు చేసే ప్రాజెక్టులు
ప్రాజెక్టు                        మెయిన్‌ సెంటర్లు        మినీ సెంటర్లు
అనంతపురం అర్బన్‌       122                        0
చెన్నేకొత్తపల్లి                144                        28
ధర్మవరం                     298                       62
కూడేరు                       243                       27
శింగనమల                  228                       39
తాడిపత్రి                     299                       45
ఉరవకొండ                  203                       13
మొత్తం                     1537                      214  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement