లో‘పాలు’ | amritha hastham scheme fail in the anantapur district | Sakshi
Sakshi News home page

లో‘పాలు’

Published Thu, Jul 27 2017 10:27 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

లో‘పాలు’ - Sakshi

లో‘పాలు’

పర్యవేక్షణ లేని అమృత హస్తం
- అంగన్‌వాడీ కేంద్రాలకు పాడైన పాలు సరఫరా
– ఉబ్బిపోతున్న ప్యాకెట్లు.. తెరిస్తే దుర్వాసన
– ప్రమాదంలో గర్భిణిలు, బాలింతల ఆరోగ్యం
– పట్టించుకోని ఐసీడీఎస్‌ అధికారులు


17 : జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు
5,126 : అంగన్‌వాడీ కేంద్రాలు
36,557 : గర్భిణిలు
34,300 : బాలింతలు


ఇవీ అంగన్‌వాడి కేంద్రాలకు సరఫరా చేసిన పాలు. కాంట్రాక్టర్ల ధన దాహానికి, అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనాలివి. ఒక గిన్నెలోని నీరంతా ప్యాకెట్‌ తెరవగానే వచ్చినవి.. రెండవది ప్యాకెట్‌ అడుగు భాగం లోనిది. విరిగిపోయిన, దుర్వాసన వస్తున్న పాలను సరఫరా చేస్తుండటంతో గర్భిణిలు.. బాలింతల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం.

అనంతపురం టౌన్‌: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్న అమృతహస్తం’ లోపాలమయంగా మారింది. జిల్లాలోని సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌) కింద 17 ప్రాజెక్టుల పరిధిలో మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 4286, మినీ కేంద్రాలు 840 ఉన్నాయి. 10 ప్రాజెక్టుల్లో గతంలో ‘అన్న అమృతహస్తం’ అమలవుతుండగా.. ఈ ఏడాది జూలై 1 నుంచి మిగిలిన అనంతపురం అర్బన్, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, కూడేరు, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ ప్రాజెక్టుల్లోనూ నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద కేంద్రాలకు వచ్చే గర్భిణిలు, బాలింతలకు సెంటర్లలోనే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. కోడిగుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు అదనంగా ఇస్తున్నారు.

ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 36,557 మంది గర్భిణిలు, 34,698 మంది బాలింతలు లబ్ధి పొందుతున్నారు. ఆయా కేంద్రాలకు ఏపీ డెయిరీకి చెందిన విజయ వజ్ర బ్రాండ్‌తో టెట్రా ప్యాకెట్లు అందిస్తున్నారు. వీటి కాల వ్యవధి 90 రోజులు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. నెల రోజులు కూడా గడవక ముందే ప్యాకెట్లన్నీ ఉబ్బిపోతున్నాయి. కొన్నింటిని తెరచి గిన్నెల్లో పోస్తే విరిగిపోయి దుర్వాసన వస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం కనిపించడం లేదు. మధ్యాహ్నం లబ్ధిదారులకు అందించేందుకు నాలుగైదు ప్యాకెట్ల పాలు గిన్నెలో పోసి చూస్తే ఒకటి రెండు పాడయి మొత్తం పాలన్నీ నిరుపయోగం అవుతున్నాయని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గర్భిణిలు, బాలింతలు పాలు తాగేందుకే అయిష్టత చూపుతున్నారు.

అధికారుల పర్యవేక్షణ కరువు
అంగన్‌వాడీ కేంద్రాల్లో ‘అన్న అమృతహస్తం’ అమలు తీరును పరిశీలించాల్సిన అధికారులు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టర్లు ధనదాహంతో నాసిరకం పాలు సరఫరా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు, కాల వ్యవధి పరిశీలించిన తర్వాతే పాలు తీసుకోవాల్సి ఉంది. కానీ సూపర్‌వైజర్లు, సీడీపీఓలు కనీసం పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. జిల్లాలో లబ్ధిదారుల అవసరాల కోసం ఎన్ని లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయనే సమాచారం కూడా అధికారుల వద్ద లేదంటే వీరి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అన్ని సెంటర్లకు పాలు సరఫరా అవుతున్నాయా? లేదా? అన్నది కూడా సందేహమే. నాణ్యత లేని పాల సరఫరాపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని తెలుస్తోంది. పెట్టెల్లో సరఫరా చేసిన పాల ప్యాకెట్లు ఉబ్బి వాసన వస్తున్నాయని కొందరు కార్యకర్తలు సమాచారం ఇస్తుండగా.. మరికొందరు గోప్యంగా ఉంచుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఎన్ని లీటర్లు సరఫరా చేశారో తెలీదు
అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలు నాసిరకంగా ఉంటే డ్యామేజ్‌ కింద తీసేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం ఎన్ని లీటర్లు సరఫరా చేస్తున్నారో తెలీదు. ఏపీ డెయిరీ నుంచి వస్తున్నాయి. బిల్లులన్నీ కమిషనరేట్‌ నుంచే చెల్లిస్తారు. అన్ని ప్రాజెక్టుల నుంచి వివరాలు తెప్పించుకుంటాం.
- కృష్ణకుమారి, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement