amritha hastham
-
లో‘పాలు’
పర్యవేక్షణ లేని అమృత హస్తం - అంగన్వాడీ కేంద్రాలకు పాడైన పాలు సరఫరా – ఉబ్బిపోతున్న ప్యాకెట్లు.. తెరిస్తే దుర్వాసన – ప్రమాదంలో గర్భిణిలు, బాలింతల ఆరోగ్యం – పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు 17 : జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్టులు 5,126 : అంగన్వాడీ కేంద్రాలు 36,557 : గర్భిణిలు 34,300 : బాలింతలు ఇవీ అంగన్వాడి కేంద్రాలకు సరఫరా చేసిన పాలు. కాంట్రాక్టర్ల ధన దాహానికి, అధికారుల పర్యవేక్షణ లోపానికి నిదర్శనాలివి. ఒక గిన్నెలోని నీరంతా ప్యాకెట్ తెరవగానే వచ్చినవి.. రెండవది ప్యాకెట్ అడుగు భాగం లోనిది. విరిగిపోయిన, దుర్వాసన వస్తున్న పాలను సరఫరా చేస్తుండటంతో గర్భిణిలు.. బాలింతల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి ఉండటం గమనార్హం. అనంతపురం టౌన్: ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగంగా గర్భిణిలు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘అన్న అమృతహస్తం’ లోపాలమయంగా మారింది. జిల్లాలోని సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్) కింద 17 ప్రాజెక్టుల పరిధిలో మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు 4286, మినీ కేంద్రాలు 840 ఉన్నాయి. 10 ప్రాజెక్టుల్లో గతంలో ‘అన్న అమృతహస్తం’ అమలవుతుండగా.. ఈ ఏడాది జూలై 1 నుంచి మిగిలిన అనంతపురం అర్బన్, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, కూడేరు, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ ప్రాజెక్టుల్లోనూ నిర్వహిస్తున్నారు. ఈ పథకం కింద కేంద్రాలకు వచ్చే గర్భిణిలు, బాలింతలకు సెంటర్లలోనే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నారు. కోడిగుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు అదనంగా ఇస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 36,557 మంది గర్భిణిలు, 34,698 మంది బాలింతలు లబ్ధి పొందుతున్నారు. ఆయా కేంద్రాలకు ఏపీ డెయిరీకి చెందిన విజయ వజ్ర బ్రాండ్‌తో టెట్రా ప్యాకెట్లు అందిస్తున్నారు. వీటి కాల వ్యవధి 90 రోజులు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అధ్వానంగా ఉంది. నెల రోజులు కూడా గడవక ముందే ప్యాకెట్లన్నీ ఉబ్బిపోతున్నాయి. కొన్నింటిని తెరచి గిన్నెల్లో పోస్తే విరిగిపోయి దుర్వాసన వస్తున్నాయి. నాణ్యత ప్రమాణాలు ఏమాత్రం కనిపించడం లేదు. మధ్యాహ్నం లబ్ధిదారులకు అందించేందుకు నాలుగైదు ప్యాకెట్ల పాలు గిన్నెలో పోసి చూస్తే ఒకటి రెండు పాడయి మొత్తం పాలన్నీ నిరుపయోగం అవుతున్నాయని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గర్భిణిలు, బాలింతలు పాలు తాగేందుకే అయిష్టత చూపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు అంగన్వాడీ కేంద్రాల్లో ‘అన్న అమృతహస్తం’ అమలు తీరును పరిశీలించాల్సిన అధికారులు మొక్కుబడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాంట్రాక్టర్లు ధనదాహంతో నాసిరకం పాలు సరఫరా చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. నిబంధనల మేరకు నాణ్యత ప్రమాణాలు, కాల వ్యవధి పరిశీలించిన తర్వాతే పాలు తీసుకోవాల్సి ఉంది. కానీ సూపర్వైజర్లు, సీడీపీఓలు కనీసం పట్టించుకుంటున్న పాపాన పోవట్లేదు. జిల్లాలో లబ్ధిదారుల అవసరాల కోసం ఎన్ని లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయనే సమాచారం కూడా అధికారుల వద్ద లేదంటే వీరి పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో అన్ని సెంటర్లకు పాలు సరఫరా అవుతున్నాయా? లేదా? అన్నది కూడా సందేహమే. నాణ్యత లేని పాల సరఫరాపై అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని తెలుస్తోంది. పెట్టెల్లో సరఫరా చేసిన పాల ప్యాకెట్లు ఉబ్బి వాసన వస్తున్నాయని కొందరు కార్యకర్తలు సమాచారం ఇస్తుండగా.. మరికొందరు గోప్యంగా ఉంచుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎన్ని లీటర్లు సరఫరా చేశారో తెలీదు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాలు నాసిరకంగా ఉంటే డ్యామేజ్ కింద తీసేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. ప్రస్తుతం ఎన్ని లీటర్లు సరఫరా చేస్తున్నారో తెలీదు. ఏపీ డెయిరీ నుంచి వస్తున్నాయి. బిల్లులన్నీ కమిషనరేట్ నుంచే చెల్లిస్తారు. అన్ని ప్రాజెక్టుల నుంచి వివరాలు తెప్పించుకుంటాం. - కృష్ణకుమారి, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ -
అ‘మృత’ హస్తం
జూలై 1 నుంచి ఏడు ప్రాజెక్టుల్లో పథకం అమలు – ఒక్క కేంద్రానికీ చేరని వంట పాత్రలు – లబోదిబోమంటున్న అంగన్వాడీ కార్యకర్తలు - ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు – శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత సొంత జిల్లాలోనే ఈ దుస్థితి ఇది అనంతపురంలోని ఓబుళదేవరనగర్–1 అంగన్వాడీ కేంద్రంలోని వంట గది. ఇక్కడ మూడేళ్ల నుంచి ఐదేళ్ల మధ్య పిల్లలు 16 మంది, గర్భిణులు 22 మంది, బాలింతలు ఏడుగురున్నారు. ‘అన్న అమృతహస్తం’ పథకం ప్రారంభమైతే మొత్తం 45 మందికీ కేంద్రంలోనే వంట చేసి ఆహారం అందించాలి. కానీ ఇక్కడ వంట చేయడానికి పాత్రలు లేవు. చిన్న పాటి కుక్కర్, గిన్నె మాత్రమే ఉన్నాయి. ఆహారం ఎలా వండి వడ్డించాలో అర్థం కాని పరిస్థితి. ఇది అనంతపురంలోని ఓబుళదేవరనగర్–2 అంగన్వాడీ కేంద్రంలోని వంట గది. ఇక్కడ పిల్లలు 18 మంది, గర్భిణులు 17 మంది, బాలింతలు 15 మంది ఉన్నారు. మొత్తంగా 42 మందికి అన్నం వండి వడ్డించాలి. ఇక్కడా ఇదే సమస్య. గతంలో పంపిణీ చేసిన పెద్ద గిన్నె ఉన్నా... కుక్కర్, గ్లాసులు, ప్లేట్లు లేవు. అనంతపురం టౌన్ : తాంబూలాలిచ్చేశాం.. తన్నుకుచావండి అన్నట్లుంది సర్కారు తీరు. వంట వండేందుకు పాత్రల్లేవ్.. అన్నం వడ్డించేందుకు కంచాల్లేవ్.. నీళ్లు తాగేందుకు గ్లాసుల్లేవ్.. ఇలా అన్నీ సమస్యలే. కానీ ‘అన్న అమృతహస్తం’ మాత్రం కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారుల ఆదేశం. దీంతో అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. గతంలో ఇలా.. ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో కనీసం 10 నుంచి 20 మంది బాలింతలు, గర్భిణులు ఉంటారు. వారికి పోషకాహారం అందించి రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి నెలా ఇంటికి రేషన్ అందించేవారు. నెలకు 16 గుడ్లు, కిలో కంది పప్పు, మూడు కిలోల బియ్యం, 456 గ్రాముల నూనె ఇచ్చే వారు. ఈ పౌష్టికాహారం సక్రమంగా వినియోగించడం లేదని ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో కేంద్రాల్లోనే భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. జూలై 1 నుంచి ‘అన్న అమృతహస్తం’ ప్రారంభం జిల్లాలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 17 ప్రాజెక్టులుండగా ఇప్పటికే పది ప్రాజెక్టుల్లో ‘అన్న అమృతహస్తం’ పథకాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా ఏడు ప్రాజెక్టుల్లో జూలై 1వ తేదీ నుంచి ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు అన్న తేడా లేకుండా అందరికీ ఆయా కేంద్రాల్లోనే భోజనం అందించాలని నిబంధన విధించారు. గతంలో టేక్ హోం రేషన్ పేరుతో అందించే పౌష్టికాహారానికి స్వస్తి పలికి సంపూర్ణ పోషకాలు ఉండే భోజనం వడ్డించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16 గ్రాముల నూనె, రోజుకో గుడ్డు అందిస్తారు. ఒక రోజు సాంబారు, ఒక రోజు రసం, ఒక రోజు ఆకుకూరను మెనూలో చేర్చారు. తరచి చూస్తే అన్నీ సమస్యలే పథకం మంచిదే అయినా ఆచరణలో మాత్రం ‘ఆదిలోనే హంసపాదు’ ఎదురయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఖర్చులు కూడా రాకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు. చాలాచోట్ల మౌలిక సదుపాయాలు లేవు. ప్రభుత్వం చెల్లించే అద్దెకు సరైన భవనాలు లభించక చిన్న గదుల్లోనే కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఇక పోషకాహారంలో నాణ్యత కొరవడుతోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చౌక దుకాణాల నుంచి వచ్చే బియ్యం, పప్పు, గుడ్డు నిర్దేశిత బరువు కన్నా తక్కువగా ఉంటున్నాయి. అవీ అరకొరే అందుతున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలకు వంట చేసేందుకు కట్టెల ఖర్చు కింద నెలకు రూ.250 చెల్లిస్తున్నారు. ఇదెంత మాత్రం సరిపోవడం లేదని సిబ్బంది అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇపుడు కొత్తగా ‘అన్నా అమృతహస్తం’ కింద గర్భిణులు, బాలింతకలకు కూడా వండి పెట్టాలంటే తమకు తలకుమించిన భారమవుతుందని సిబ్బంది చెబుతున్నారు. మంత్రికి చెప్పినా ఫలితం శూన్యం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత దృష్టికి ఈ సమస్యలన్నీ తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాగైనా పథకాన్ని అనుకున్న సమయానికే కచ్చితంగా అమలు చేయాలని మంత్రి చెబుతున్నారనీ, అందువల్ల కనీసం వంట పాత్రలనైనా సరఫరా చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. అన్న అమృతహస్తం పథకం అమలు చేసేందుకు మూడు నెలల బిల్లులు అడ్వాన్స్‌గా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ‘అన్న అమృతహస్తం’ అమలు చేసే ప్రాజెక్టులు ప్రాజెక్టు మెయిన్ సెంటర్లు మినీ సెంటర్లు అనంతపురం అర్బన్ 122 0 చెన్నేకొత్తపల్లి 144 28 ధర్మవరం 298 62 కూడేరు 243 27 శింగనమల 228 39 తాడిపత్రి 299 45 ఉరవకొండ 203 13 మొత్తం 1537 214