
ఆరోగ్యమాత ఉత్సవాలు ప్రారంభం
కడప కల్చరల్ :
కడప నగరం రైల్వేస్టేషన్ వద్దగల వేలాంగిణి ఆరోగ్యమాత నవదిన ఉత్సవాలను సోమవారం మేత్రాసన కడప డయాసిస్ పీఠాధిపతి మోస్ట్ రెవరెండ్ బిషప్ గల్లెల ప్రసాద్ ప్రారంభించారు. ఈ క్షేత్రం ఆవరణంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల ప్రారంభ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభువైన ఏసుక్రీస్తును మానవ లోకానికి అందించిన ఆరోగ్యమాత పవిత్రమైన జననిగా పూజలందుకోవడం గర్వకారణమన్నారు. ప్రభువు ద్వారా ఆమె ప్రపంచానికి ప్రేమ, శాంతి, సమాధానాలను అందించేందుకు ఎంతగానో తోడ్పడుతోందన్నారు. అనంతరం ఆయన సమిష్టి దివ్య బలిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వాసులు పాత గుడిచుట్టూ ఆరోగ్యమాత స్వరూపంతో ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమానికి మేత్రాసన వికర్ జనరల్ మోన్సిగ్నోర్ ఈరి లూర్దుమరియన్న, ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం డైరెక్టర్ కన్నా జయన్న సహాయ అర్చకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎంపీఎస్‌ఎస్‌ఎస్ డైరెక్టర్ ఫాదర్ ఎల్.ఆరోగ్యరాజు, సెయింట్ మెరీస్ క్యాథడ్రల్ ఫాదర్ సగిలి ›ప్రకాశ్, నందిపల్లె విచారణ గురువులు ఫాదర్ బడుగు శ్యాంసన్, కడప మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ సగినాల పాల్ ప్రకాశ్, ఆరోగ్యమాత క్షేత్రం సహాయ గురువులు లూర్దురాజు, ఫాదర్ సుమన్, ఆరోగ్యమాత సభ సిస్టర్లు, తిరునాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.