కళాకారుల నోరు నొక్కొద్దు
కళాకారుల నోరు నొక్కొద్దు
Published Thu, Oct 13 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
విజయవాడ గాంధీనగర్): కళాకారులు, కవులపై మతోన్మాదుల దాడులను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్యమండలి, ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన జరిగింది. హనుమాన్‌పేటలోని సీపీఐ కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన ఆంధ్రరత్నరోడ్డు, గాంధీనగర్, అలంకార్‌సెంటర్ మీదుగా లెనిన్‌సెంటర్ వరకు సాగింది. అక్కడ కొద్దిసేపు ధర్నా చేశారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చంద్రానాయక్ మాట్లాడుతూ ఇండోర్‌లో ఇఫ్టా 14వ జాతీయ మహాసభల సందర్భంగా కళాకారులపై మతోన్మాదులు చేసిన దాడిని ఖండించారు. మహాసభల వేదికపైకి ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు జాతీయ జెండాతో వచ్చి ‘భారతమాతాకీ జై’ అనాలంటూ మైకులు ఆపుచేసి దౌర్జన్యానికి దిగారన్నారు. ఇటీవల కాలంలో కళాకారులు, రచయితలు, మేధావులపై దాడులు పెరిగాయన్నారు.
వాక్‌స్వాతంత్య్రాన్ని హరిస్తున్నారు: ముప్పాళ్ల
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగిన హిందూ మతాన్ని బీజేపీ , ఆర్‌ఎస్‌ఎస్ శక్తులు మంటగలుపుతున్నాయన్నారు. భారత్‌మాతాకీ జై, వందేమాతరం అనే పదాలు జాతీయతకు చిహ్నాలని అటువంటిని హిందూత్వ శక్తులు అపహాస్యం చేస్తున్నాయన్నారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంలో రాజ్యాంగం కల్పించి వాక్‌స్వాతంత్యాన్ని హరిస్తున్నారన్నారు. దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ప్రదర్శనలో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు గనీ, సహాయ కార్యదర్శి మహంతు సుబ్బారావు,. ఎస్‌కే నజీర్, జానీ, కెవీ భాస్కరరావు, కె అప్పారావు, ఆర్ పిచ్చయ్య, ఎఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement