ఆగిపోయిన ప్రజా కలం
– ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాసు అస్తమయం
– చిన్న వయస్సులోనే వందల పాటలు రాసిన రచయిత
– మూడో తరగతే చదివినా.. జీవితాన్ని అధ్యయనం చేసిన ప్రజాకవి
– వాసు మృతికి ప్రముఖుల సంతాపం
కర్నూలు (కల్చరల్): నా చిట్టి తమ్ముళ్లారా రారే.. నా చిట్టి చెళ్లెల్లారా రారే.. రేపన్న రూపు రేఖలు మీరే... నా సెమట సుక్కో.. నా సెమెట సుక్కో... సుత్తి కొడవలి మీద ముత్యమై మెరిసే...అమ్మా నేను ఆగమైతే.. అక్షరాలు రెండు నేర్వక... నాగమ్మ పడగలో లాంటి రాష్ట్రవ్యాప్త ప్రాచుర్యం పొందిన ప్రజలు పాటలు రాసిన కలం ఆకస్మికంగా ఆగిపోయింది. కర్మాగారాల్లో, చేలల్లో, వర్కు షాపుల్లో పని చేస్తున్న బాల కార్మికుల దయనీయ జీవితాలను కూలి, నాలీల కడగండ్లను సిరాగా మార్చి కలంలో పోసి, అద్వితీయమైన పాటలు రాసిన ప్రజానాట్య మండలి వాసి ఇక లేరు. కర్నూలు నగరం, ఇందిరాగాంధీ నగర్ వాస్తవ్యులైన వాసు చదువుకున్నది మూడో తరగతే. కానీ దారిద్య్రాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడపడంతో పేదరికం కోణాలన్నింటినీ చవి చూసిన వాసు దారిద్య్రంపై అక్షరాలను ఎక్కుపెట్టి సాహితీ సృజన చేశారు. ఆయన ఆదివారం ఉదయం అమరావతిలో జరుగుతున్న ప్రజానాట్య మండలి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ, మాట్లాడుతూనే తీవ్రమైన గుండెనొప్పితో కుప్పకూలి పోయారు. సహచర కళాకారులు ఆయనను వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణం కోల్పోయారు. గతరెండు రోజులుగా ప్రజా
కళలపై పాటలు రాసి, బాణీలు కట్టి, గజ్జ కట్టి ఆడుతూ, పాడుతూ ఉత్సాహం నింపిన ప్రజా కళాకారుడు తమ కళ్ల ముందే ప్రాణం కోల్పోవడం చూసిన కళాకారులు శోక సంద్రంలో మునిగిపోయారు.
బాల్యం నుంచి పాటలపైనే దష్టి ..
కర్నూలు నగరంలోని మురికి వాడల్లో పుట్టి పెరిగిన వాసు మూడో తరగతితోనే చదువుకు చుక్క పెట్టారు. పని చేస్తేగాని పొద్దుగడవని స్థితిలో ఉన్న వాసు రకరకాల వర్క్‌షాపుల్లో కూలీగా పని చేశారు. ఈ క్రమంలో ఆయనకు సీపీఎం ప్రధాన నాట్య మండలితో పరిచయం ఏర్పడింది. పదునైన పాటలు పాడుతూ.. పాడుతూ.. ఆయన పాటలు రాయడం ప్రారంభించారు. బాల కార్మిక వ్యవస్థ, నిరక్ష్యరాస్యత నిర్మూలన తదితర కార్యక్రమాల్లో 1990 నుంచి ఆయన చురుగ్గా పాల్గొన్నారు. మహిళా కూలీలు, ఫ్యాక్టరీల్లో కార్మికులు చాలీచాలని జీతాలతో బతుకుతున్న వైనాన్ని అక్షరీకరించారు. ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ప్రజా పాటలు పాడుతున్న సుజాత అనే కళాకారిణిని పెళ్లి చేసుకున్నారు. ప్రజానాట్య మండలికే తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు. పేద ప్రజల కడగండ్లను నాటికలుగా, గేయాలుగా, పాటలుగా రాస్తూ ప్రజా కళలను ఆదరించాలనే ప్రచారం చేశారు. ఈయన రాసిన నా సెమట సుక్కో.. పాటను విని ఆంధ్రప్రదేశ్ తెలుగు అధికార భాష సంఘం అధ్యక్షుడు రాళ్లబండి కవితా ప్రసాద్ కన్నీరు కార్చి, వాసును భుజం తట్టి మెచ్చుకున్నారు. సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ వాసు పాటల్లో ప్రజల ఆర్థి, ప్రజల వ్య«థ స్పష్టంగా కనిపిస్తుందని ప్రశంసించారు.
కళాకారుల సంతాపం..
ప్రజల పాటలు రాస్తూ, పేదల కోసమే జీవితాన్ని అంకితం చేసిన వాసు మరణం ప్రజా నాట్య మండలికి తీరని లోటని, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి బసవరాజు, సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, జిల్లా కార్యదర్శి కెంగార మోహన్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. వాసు రాసిన పాటలను పలు వేదికలపై పాడి, ప్రజల్లో చైతన్యం నింపామని, ప్రముఖ గజల్ గాయకుడు మహమ్మద్‌మియ్యా అన్నారు. వాసు పాటలు అజరామరంగా ప్రజల్లో గుండెల్లో నిలిచిపోతాయని ప్రముఖ రచయిత ఇనాయతుల్లా అన్నారు. వాసు పాటలు ప్రజ ల బాధల్ని లోకానికి చాటి చెప్పాయని లలిత కళా సమితి పత్తి ఓబులయ్య అన్నారు. ప్రముఖ రచయితలు ఎస్‌డీవీ అజీజ్, వెంకటకష్ణ, ప్రజాభ్యుదయ సంస్థ భార్గవ, అధ్యక్షుడు శ్రీనివాస్, ధర్మపేట యువజన సంఘం నాయకులు ఇమ్మానియేలు, యేసేపు తదితరులు సంతాపం ప్రకటించారు.