- తొక్కిసలాట క్షతగాత్రులకు వైఎస్ జగన్ పరామర్శ
- ప్రస్తుత పాలకులదే ఈ పాపం
- టీటీడీ చైర్మన్, ఈవో, అడిషనల్ ఈవో, కలెక్టర్, ఎస్పీలదే బాధ్యత
- సీఎం చంద్రబాబు వైఫల్యం వల్లే ఈ దారుణం
- ఈ పాపం ఊరికే పోదు
- తప్పు చేశానని ఒప్పుకునే మనస్తత్వం చంద్రబాబుకు లేదు
- చంద్రబాబుకు దేవుడు అంటే భయం లేదు.. భక్తీ లేదు
- ఈ ఘటనకు మొదటి ముద్దాయి చంద్రబాబే
- వైఎస్ జగన్ ధ్వజం
తిరుపతి: తిరుపతిలో తొక్కిసలాట( Tirupati Stampede Incident) జరిగి ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) పరామర్శించారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తిరుపతిలో ఈ తరహా ఘటన ఎప్పుడూ జరగలేదు. మనం చూడలేదు. ఈ ఘటన ఎందుకు జరిగిందనేది ఆలోచన చేయాలి. ఇది పూర్తిగా ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) వైఫల్యమే. ఈ ఘటనలో మొదటి ముద్దాయి చంద్రబాబే. బాధిత కుటుంబాలకు కనీపం రూ. 50 లక్షల ఇవ్వాలి. క్షతగాత్రులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారు ఇంటికి వెళ్లేటప్పుడు రూ. 5 లక్షలు ఇవ్వాలి’ అని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
అత్యంత దారుణ ఘటన
రాష్ట్ర చరిత్రలో తిరుపతిలో ఎప్పుడూ తొక్కిసలాట జరిగి మనుషులు చనిపోయిన ఘటన గతంలో మనం ఎప్పుడూ చూడలేదు. ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారితీసిన కారణాలు ఏంటన్నది అందరం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన ఎందుకు జరిగింది. ఘటన జరగడానికి కారణాలు ఏంటన్నది ఆలోచన చేయాలి.
వైకుంఠ ఏకాదశి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. వైకుంఠ ఏకాదశి నాడు కొన్ని లక్షల మంది వెంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తారని.. ఆరోజు వైకుంఠద్వార తెరుస్తారని అందరికీ తెలుసు. వైకుంఠ ద్వారం దర్శనం మహాపుణ్యాన్నిస్తుందని అందరికీ తెలుసు. ఆ పుణ్యం కోసం లక్షల మంది దర్శనానికి వస్తారు. 10వ తేదీ వైకుంఠ ఏకాదశి అని, ఆరోజు లక్షల మంది దర్శనానికి వస్తారని తెలిసినప్పటికీ టీటీడీలో ఎందుకు ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతున్నాను.
తెలిసినా ప్రొటోకాల్స్ పాటించలేదు
ఈ ఘటలనకు సీఎం మొదలు, టీటీడీ ఛైర్మన్, అధికారులు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యులే. చంద్రబాబునాయుడుగారికి కూడా 10వ తేదీన వైకుంఠ ఏకాదశి అని తెలుసు. అంతకు ముందే ఆయన కుప్పంలో మూడు రోజుల కార్యక్రమం పెట్టుకున్నారు. ఈనెల 6 నుంచి 8వ తేదీ మధ్యహ్నం వరకు ఆయన అక్కడే ఉన్నారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులతో పాటు, పోలీసు అధికారులు కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడం కోసం వెళ్లారు. సీఎం సెక్యూరిటీ కోసం దాదాపు 2 వేల మంది పోలీసులు కూడా అక్కడే ఉన్నారు.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లను 8వ తేదీ రాత్రి 8.30 గం.కు ఇస్తున్నప్పుడు తొక్కిసలాటలు జరిగాయి. వైకుంఠ ఏకాదశి రోజున దర్శనానికి ఇన్ని లక్షల మంది వస్తారని తెలిసినప్పుడు, మరోవైపు చంద్రబాబు పర్యటన కుప్పంలో ఉందని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయలేదు.
ఈ ఘటన జరగడానికి కారణం ఎక్కడా ప్రోటోకాల్ పాటించలేదు.
ఏ మాత్రం జాగ్రత్త లేకుండా వ్యవహారం
తిరుపతి, బైరాగిపట్టెడ కౌంటర్ ఎదురుగా పార్కులో ఉదయం 9 గం. నుంచి భక్తులను ఉంచారు. రాత్రి 8.30 గం.కు పార్కు గేట్లు తెరిచి కౌంటర్లు దగ్గర వెళ్లడానికి గేట్లు తెరిచారు. చీకట్లో అందరూ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లడంతో తొక్కిసలాట జరిగింది. పార్కులో ఉంచినప్పుడు వారికి ఏ సౌకర్యాలు కల్పించలేదు. భక్తులు వచ్చిన వెంటనే వాళ్లను క్యూ లైన్లో నిల్చోబెట్టి, తగినంత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కానీ అలా చేయలేదు. ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టడానికి పోలీసులు అందుబాటులో లేకపోవడంతో పాటు భక్తులందరినీ గుంపుగా ఉంచి.. ఒకేసారి విడిచిపెట్టడంతో ఈ ఘటనలు జరిగాయి.
చంద్రబాబునాయుడు గారు ఎంత దిక్కుమాలిన అబద్దాలు ఆడుతున్నారంటే.. ఒకే ఒక్క చోట తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్‌ఐఆర్ కాపీలు చూస్తే.. విష్ణు నివాసం దగ్గర ఒకరు చనిపోయారని, బైరాగిపట్టెడిలో ఐదుగురు చనిపోయినట్టు మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆస్పత్రిలో చూస్తే.. అన్ని కౌంటర్లలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కనిపిస్తున్నారు.
ఇలాంటి ఘటన తొలిసారి
ఇంత ప్రాముఖ్యమున్న వైకుంఠ ఏకాదశి రోజున ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారని తెలిసినా ఇంత దారుణమైన ఏర్పాట్లు చేశారు. దీనికి టీటీడి ఒక్కటే బాధ్యులు కాదు. ఎస్పీ పోలీసు విభాగం, కలెక్టర్, రెవెన్యూ విభాగంతో పాటు చంద్రబాబు నాయుడు గారు తో సహా అందరూ బాధ్యత వహించాలి
చంద్రబాబు సొంత జిల్లా ఇది.. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి నాడు లక్షలాది మంది భక్తులు వస్తారని తనకు తెలిసి ఉన్నా.. 6, 7, 8 తేదీల్లో తన కార్యక్రమం కోసం పోలీసులను నియమించుకుని.. ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా గాలికొదిలేశారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే 6గురు చనిపోయారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించాను. దేవుడి దయవల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు అందరూ కొద్దిపాటి గాయాలతో భయటపడడం సంతోషం. పద్మావతి, రుయా ఆసుపత్రి కలుపుకుంటే దాదాపుగా 50 నుంచి 60 మంది తొక్కిసలాటలో గాయాలపాలయ్యారు. తిరుపతిలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఇదే తొలిసారి.
అడుగడుగునా నిర్లక్ష్యం
ఇంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్లు వ్యవస్ధను నడుపుతున్నారు. ఇక్కడున్న పోలీసులు, టీటీడీ పెద్దలు ఎవరికీ టీటీడీ విశిష్టత తెలియదు. ఇక్కడున్న ఎస్పీ, కలెక్టరు వీళ్లు ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న రోజుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నదానిపై దశాబ్దాలుగా చాలా కాలం నుంచి ప్రోటోకాల్ ఉన్న వీళ్లెవరూ పట్టించుకోలేదు.
టీటీడీ ఛైర్మన్ నుంచి పోలీసు వ్యవస్ధ వరకూ తిరుమలలో ఇన్న లక్షల మంది వస్తున్న నేపధ్యంలో వారికి ఎలాంటి రక్షణ, వసతులు కల్పించాలన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కనీసం పార్కుల్లో ఉన్న వారిని అడిగితే ఉదయం 9 గంటలకు వచ్చాం. కనీసం నీళ్లు, ఆహారం, మజ్జిగ కూడా ఇవ్వలేదని చెబుతున్నారు. క్యూలైన్లో నిలబెట్టడం, రోప్ పార్టీలు ఏర్పాటు చేయడం కూడా చేయలేదు. కనీసం వీళ్లు మనుషులుగా ఉన్నారని కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా గాలికొదిలేశారు.
మా ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాలను గొప్పగా చెప్పుకునేలా నిర్వహించాం. ఈ ప్రభుత్వంలో భక్తుల కనీస అవసరాలను కూడా పట్టించుకోలేదు.
ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత
తిరుపతిలో తొక్కిసలాట ప్రభుత్వ తప్పిదం. ప్రభుత్వ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగింది. దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి చంద్రబాబును గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. చనిపోయిన వాళ్లకు ప్రతి ఒక్కిరికీ రూ.50 లక్షలు నష్టపరిహారం చెల్లించడంతో పాటు గాయాల పాలైన వారందరికీ ఉచిత వైద్యం అందించడంతో పాటు ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలు డబ్బులిచ్చి ఇంటికి పంపించాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ ఘటనకు చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్, టీటీడీ ఈవో, టీటీడీ అడిషనల్ ఈవో, ఎస్పీ, కలెక్టరు బాధ్యత వహించాలి. తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించకుండా ఈ మరణాలకు కారణమైన వీళ్లందరిపైనా చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, దేవాదాయశాఖమంత్రితో పాటు టీటీడీ ఛైర్మన్, ఈవో, అదనపు ఈఓ, కలెక్టర్, ఎస్పీ అందరూ బాధ్యత తీసుకోవాలి.
ఎఫ్‌ఐఆర్ కచ్చితంగా మార్చాలి
తొక్కిసలాట ఘటనపై ఎఫ్‌ఐఆర్‌లో వీళ్లు దారుణమైన సెక్షన్లు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనపై బీఎన్‌ఎస్ 194–సెక్షన్ నమోదు చేస్తున్నారు. అంటే ఇద్దరు వ్యక్తులు మధ్య జరిగే దొమ్మీ కింది కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన జరిగిన ఈ సంఘటనపై సెక్షన్–105 నమోదు చేయాల్సింది పోయి.. కావాలనే సంఘటనను చిన్నదిగా చూపేందుకు, కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వం దారుణంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అందుకే వెంటనే ఎఫ్‌ఐఆర్ మార్చాలి.
తప్పుల మీద తప్పులు
వీళ్లకు కనీస మానవత్వం, చిత్తశుద్ధి కూడా లేదు. బాగా చేయాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. తిరుమల తిరుపతి దేవస్ధానానికి సంబంధించిన పరువు, ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి దిగజార్చే పరిస్థితి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వచ్చింది. ఆయన తప్పులు మీద తప్పులు చేస్తున్నారు.
తిరుపతి లడ్డూ విషయంలో అబద్దాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టించి.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్రతిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన చంద్రబాబు మళ్లీ తాను చేసిన చర్యల వల్ల టీటీడీ చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ మార్క్‌గా నిల్చిపోయే ఘటన చోటుచేసుకుంది. ఇన్ని సంవత్సరాలుగా తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది.ఇక్కడికి వచ్చిన క్రౌడ్‌ను మేనేజ్ చేసే విశిష్టత తిరుమల తిరుపతి దేవస్ధానంకు ఉన్నట్టుగా ఎక్కడా ఎవరికీ లేదన్న ఖ్యాతి. ఎంతో పేరు ఉన్న స్ధితి నుంచి ఏకంగా చంద్రబాబునాయుడు లాంటి పాలకుడు ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్ధానంలో అడుగు పెట్టాలంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటాయో చంద్రబాబు చేసి చూపించారు.
మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
వారందరిదీ తప్పిదమే. ఎందుకంటే..?:
చంద్రబాబునాయుడు ఈ ఘటనలో చిన్న చిన్న అధికారులను బదిలీ వంటి శిక్షలతో సరిపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. నిజానికి ఇందులో చంద్రబాబునాయుడు చేసిన తప్పు కనిపిస్తోంది. భక్తుల కోసం పోలీసులను కేటాయించాల్సింది పోయి.. తన పర్యటన కోసం పోలీసులను మోహరించుకున్నారు. అదే విధంగా జిల్లా ఎస్పీ కూడా చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తాపత్రయపడ్డారే తప్ప.. లక్షలాది మంది భక్తులకు సెక్యూరిటీ కల్పించాలని ఆలోచన చేయలేదు. అదే విధంగా భక్తులకు క్యూలైన్లలో నిలబెట్టే కార్యక్రమంతోపాటు దానికి సంబంధించిన సమీక్షలు చేయని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు రికమెండ్ చేయాలన్న ఆలోచన చేయని కలెక్టర్‌ది కూడా తప్పే. భక్తులకు తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఏర్పాటు చేయకపోవడం కూడా కలెక్టర్ తప్పు.
ఇంత మందిని దర్శనానికి ప్రవేశం కల్పించాలన్న ఆలోచన చేయని ఈఓ, అదనపు ఈఓది కూడా తప్పు. వీరందరికీ ఆజమాయిషీ చేసే టీటీడీ ఛైర్మన్‌ది కూడా తప్పే.
ఏర్పాట్లపై ఏ మాత్రం శ్రద్ద లేదు:
వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లుపై సమీక్ష చేయకుండా తాత్సారం చేసి ఇంత మంది చావులకు వీరంతా కారణమయ్యారు. ఏర్పాట్లు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. మూడు వేర్వేరు కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. అన్ని చోట్ల తగినంత మంది పోలీసుల సిబ్బంది లేకపోవడం, సరైన ఏర్పాట్లు లేకపోవడమే ప్రధాన తప్పిదం.
ముందుజాగ్రత్తగా ఆయా కౌంటర్ల వద్ద కచ్చితంగా ఆంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కనీసం ఘటన జరిగిన తర్వాత కూడా ఆంబులెన్స్ రావడానికి ముప్పావు గంట, గంట పట్టిందని ఆసుపత్రులో చికిత్స పొందుతున్న వారు చెబుతున్నారు. అది కూడా ఒక్కోటి వచ్చిందని చెప్పారు. ఇంకా కొందరు వాళ్లంతట వాళ్లే ఆసుపత్రికి వచ్చామని చెబుతుండగా... ఇతరుల సాయంతో మరికొంతమంది ఆసుపత్రి వచ్చామన్నారు.
చంద్రబాబే మొదటి ముద్దాయి. ఎందుకంటే?
చంద్రబాబునాయుడికి శాస్త్రం తెలియదు, మిగిలిన గుడుల్లో ఎలా చేస్తున్నారన్న ఆచరణ కూడా తెలియదు. దేవుడి మీద భయభక్తులు కూడా లేవు. దేవుడి మీద భక్తి, భయం ఉంటే.. తిరుమల తిరుపతి ప్రసాదం గురించి అబద్దాలు చెప్పగలుగుతాడా?. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి టీటీడీ ప్రతిష్టను దిగజార్చే పని చేస్తాడా?. దేవుడంటే భయం, భక్తి లేదు కాబట్టే ఇలా చేశాడు. చంద్రబాబు నాయుడే ఈ ఘటనలో మొదటి ముద్దాయి. చంద్రబాబునాయుడుకి ఈ పాపం కచ్చితంగా తగులుతుంది.
తప్పు చేసిన తర్వాత దేవుడికి, భక్తులకి కనీసం క్షమాపణ చెప్పే చిత్తశుద్ధి, ఇంగిత జ్ఞానం లేదు. తాను చేసిన తప్పులకు వేరొకరి మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో పుష్కరాల్లో కూడా ఇదే పని చేశాడు. షూటింగ్ కోసం అందరినీ ఒకేచోట పెట్టి.. గేట్లు ఒకేసారి ఎత్తారు. తొక్కిసలాటలో 29 మంది చనిపోయారు. ఆయన షూటింగ్ కోసం ఆయన దగ్గర, ఆయన సమక్షంలోనే ఆ ఘటన జరిగింది.
నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు
నేను తిరుపతి వచ్చి.. జరిగిన విషయాలు ప్రజలకు చెప్తానని.. చంద్రబాబునాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లను కూడా ఇక్కడ నుంచి తరలించారు. మా పరిస్ధితి బాగాలేదని పేషెంట్లు ఇంకా కొంతమంది ఆసుపత్రిలో భీష్మించుకుని ఉన్నారు. నన్ను రాకుండా చేసేందుకు కుట్ర పన్నారు. మధ్యలో ఆపాలని చూశారు. ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబుతో కుమ్మక్కైన అధికారులందరీకి దేవుడి మెట్టికాయలు కచ్చితంగా పడతాయి.
Comments
Please login to add a commentAdd a comment