తేలిన ఉద్యోగుల లెక్క | As a proxy for the number of employees | Sakshi
Sakshi News home page

తేలిన ఉద్యోగుల లెక్క

Published Wed, Aug 24 2016 1:17 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

As a proxy for the number of employees

నల్లగొండకు 1257, సూర్యాపేటకు 928, యాదాద్రికి 831 పోస్టులు అవసరం
–కలెక్టరేట్‌లు, పశుసంవర్థక శాఖలకు భారీగా పోస్టులు అవసరం
–వైద్యశాఖకు కూడా ఓ మోస్తరుగా.. మిగిలిన శాఖలకు సరిపోయే అవకాశం
–జిల్లాల వారీగా పంచిన అధికారులు.. త్వరలోనే పంపిణీ షురూ
–జిల్లా పోస్టులకు స్థానికతే ప్రామాణికం.. అవసరమైతే జూనియర్లకు అనివార్య బదిలీలు
–జోనలæ, రాష్ట్ర పోస్టులకు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు..
–మూడు జిల్లాల్లో కలిపి మంజూరైన పోస్టులు 2,755
–ఖాళీగా ఉన్న పోస్టులు 668, అదనంగా కావాల్సినవి 288
–మూడు జిల్లాల ప్రభుత్వ ఉద్యోగుల విభజనపై ప్రాథమిక కసరత్తు పూర్తి
–ఉపాధ్యాయులు, పోలీసులకు ప్రత్యేక కసరత్తు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా విభజన ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో జిల్లాలోని ఉద్యోగుల విభజనపై కూడా అధికార యంత్రాంగం ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న శాశ్వత ఉద్యోగులను నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రికి పంపిణీ చేస్తూ లెక్కలు తేల్చింది. ఈ లెక్కల ప్రకారం ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో 2,755 పోస్టులుండగా, అందులో 1257 నల్లగొండకు, 928 పోస్టులు సూర్యాపేటకు, 831 పోస్టులు యాదాద్రికి పంపిణీ చేసింది. జనాభా, మండలాల ప్రాతిపదికన కేటాయించిన ఈ పోస్టులకు సంబంధించిన పంపిణీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ పంపిణీకి సంబంధించిన ఉత్తర్వులు, మార్గదర్శకాల కోసం జిల్లా యంత్రాంగం ఎదురుచూస్తోంది. కాగా, మూడు జిల్లాల్లోకి ఉద్యోగుల పంపిణీకి స్థానికతనే ప్రామాణికంగా తీసుకుంటారని జిల్లాలోని ఓ సీనియర్‌ అధికారి ‘సాక్షి’కి చెప్పారు. జిల్లా, అంతకన్నా తక్కువ స్థాయిల్లో పనిచేస్తున్న ఉద్యోగుల స్వంత మండలం, గ్రామాన్ని బట్టి ఆయా ఉద్యోగులను ఆ జిల్లాకు పంపిస్తారని, అవసరమైన ఉద్యోగులు పోను ఇంకా అవసరం అయితే ఆయా శాఖల్లో, ఆయా హోదాల్లో ఉన్న జూనియర్లకు అనివార్య బదిలీలు చేస్తారని తెలుస్తోంది. అయితే, జోనల్‌ పోస్టులు, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వారి పంపిణీ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని సమాచారం. ఈ నేపథ్యంలో అటు జిల్లా పోస్టులకు, ఇటు జోనల్, రాష్ట్ర పోస్టులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేస్తుంది... ఏ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులను మూడు జిల్లాలకు పంపిణీ చేస్తుందనేది ఇప్పుడు జిల్లా ఉద్యోగ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
సుమారు వెయ్యి
ఇదిలా ఉంటే, మూడు జిల్లాలకు పంపిణీ చేసిన పోస్టులను పరిశీలిస్తే, ప్రస్తుతం మంజూరై ఉన్న పోస్టుల కన్నా 288 పోస్టులు అవసరమవుతున్నాయి. మరి, ఈ పోస్టులను ఎలా భర్తీ చేస్తారనేది ఓ ప్రశ్నగా కనిపిస్తోంది. అయితే, ఒక్క జిల్లాను మూడు జిల్లాలుగా విభజించిన పక్షంలో మాత జిల్లాలో మంజూరై ఉన్న పోస్టుల్లో మూడో వంతు సూపర్‌న్యూమర్‌ పోస్టులను మంజూరు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అలా జరిగితే మూడు జిల్లాలకు ఉద్యోగుల పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండబోదని తెలుస్తోంది. అలా కాని పక్షంలో నూతన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో మంజూరైన పోస్టుల్లో 668 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలతో పాటు అదన ంగా కావాల్సిన 288 కలిపి మొత్తం 1000 వరకు ప్రభుత్వ ఉద్యోగుల కొరత మూడు జిల్లాల్లో ఉంటుందని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. కలెక్టరేట్‌ కార్యాలయాలకు సంబంధించిన లెక్కలు పరిశీలిస్తే ప్రస్తుత కలెక్టరేట్‌లో 75 మంజూరు పోస్టులున్నాయి. అందులో 4 ఖాళీలున్నాయి. ఇప్పుడు మూడు జిల్లాలకు గాను ఒక్కో కలెక్టరేట్‌కు 50 మంది చొప్పున 150 మంది అవసరమని అధికారులు అంచనా వేశారు. అంటే ఇప్పుడున్న పోస్టులకన్నా మరో 75 పోస్టులు అదనంగా కావాలి. ఖాళీలను కూడా కలుపుకుంటే 79 అవసరం అవుతాయి. మరి ఈ పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న 71 మందిని మూడు జిల్లాలకు పంపిణీ చేస్తే పరిస్థితేంటనేది అర్థం కాని పరిస్థితి. ఇక, పశుసంవర్థక, వైద్య శాఖల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన శాఖల్లోనూ ఖాళీలు బాగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదనపు పోస్టులు ఇవ్వకపోయినా, మూడోవంతు పోస్టులు అదనంగా మంజూరు చేయకపోయినా, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోయినా జిల్లాల విభజన అనంతరం మూడు జిల్లాలు ఉద్యోగుల కొరతను తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని శాఖల్లో అయితే మంజూరైన పోస్టుల్లో సగమే భర్తీ అయి ఉన్నాయి. అందులో ఒక్క జిల్లాకే ఆ సగం పోస్టులు సరిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన రెండు జిల్లాల పరిస్థితి ఆగమ్యగోచరమే. అవే సగం పోస్టులను మూడు జిల్లాలకు పంపిణీ చేసినా మూడు జిల్లాల్లోనూ ఉద్యోగుల కొరతే. ఈ నేపథ్యంలో అసలు ఉద్యోగుల పంపిణీకి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు, మార్గదర్శకాలు ఇస్తుంది? అదనపు పోస్టులను ఎలా మంజూరు చేస్తుంది? అసలు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ జరుగుతుందా? అన్న దానిపైనే మూడు జిల్లాల భవిష్యత్తు ఆధారపడనుందని ఉద్యోగ సంఘాలంటున్నాయి. ఇదిలా ఉంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పోలీసులకు సంబంధించిన పంపిణీ కసరత్తు ప్రత్యేకంగా జరుగుతోంది. పోలీసులకు సంబంధించి పంపిణీ కసరత్తు తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.




యాదాద్రిపై భారీ అభ్యంతరాలు
–ఒక్కరోజే ప్రభుత్వ వెబ్‌సైట్‌లో 163 అభ్యంతరాలు, సూచనలు నమోదు
–నల్లగొండ జిల్లాపై 14, సూర్యాపేటపై 5...
–ఆర్డీవో కేంద్రాల ఏర్పాటుపై 7, మండలాల ఏర్పాటుపై 19
(సాక్షి ప్రతినిధి, నల్లగొండ)
నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలు, 7 రెవెన్యూ డివిజన్లు, 71 మండలాలుగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం ఒక్క రోజే 208 అభ్యంతరాలు, సూచనలు నమోదయ్యాయి. ఇందులో ముఖ్యంగా యాదాద్రి జిల్లా ఏర్పాటుపై 163 అభ్యంతరాలు నమోదయ్యాయని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టిన లెక్కలు చెపుతున్నాయి. ఈ జిల్లా ఏర్పాటులో కలిపిన మండలాలు, నియోజకవర్గాలలో మార్పులు సూచిస్తూ, ఫలానా మండలాన్ని ఈ జిల్లాలో కలపవద్దంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 163 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఎక్కువగా వరంగల్‌ జిల్లా నుంచి యాదాద్రిలోనికి వచ్చే నాలుగు మండలాల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ జిల్లాలో ఆర్డీవో కేంద్రాలుగా పేర్కొన్న జనగాం, భువనగిరిలపై కూడా 5, 20 మండలాలపై 5 అభ్యంతరాలు, సూచనలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా ఏర్పాటుపై 14, నల్లగొండ జిల్లా పరిధిలోని ఆర్డీవో కేంద్రాలపై 2, మండలాలపై 8 అభ్యంతరాలు, సూచనలు వచ్చాయి. ఇక, సూర్యాపేట విషయంలో పెద్దగా అభ్యంతరాలు, సూచనలు నమోదు కాలేదు. ఈ జిల్లా ఏర్పాటుపై 5 అభ్యంతరాలు రాగా, ఆర్డీవో కేంద్రాలపై ఒక్క అభ్యంతరం కూడా నమోదు కాలేదు. ఈ జిల్లాలో ప్రతిపాదించిన మండలాలపై మాత్రం ఒక్క అభ్యంతరం వచ్చినట్టు వెబ్‌సైట్‌లో పొందుపరిచిన లెక్కలు చెపుతున్నాయి. కాగా, ప్రభుత్వ ప్రాథమిక నోటిఫికేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నేరుగా జిల్లా కలెక్టర్‌కు గానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ..... వెబ్‌సైట్‌లో కానీ 30 రోజుల్లోపు తెలియజేయవచ్చని ప్రభుత్వ అధికారులు చెపుతున్నారు.
అభ్యంతరాలు, సూచనల వివరాలివి:
జిల్లాపేరు    జిల్లా అభ్యంతరాలు    ఆర్డీవో అభ్యంతరాలు    మండలాల అభ్యంతరాలు
నల్లగొండ    14            2            8
సూర్యాపేట    5            0            1
యాదాద్రి    163            5            10
––––––––––––––––––––––––––––––––––––––––––––––
మొత్తం        182            7            19
––––––––––––––––––––––––––––––––––––––––––––––
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement