విద్యుత్ విజిలెన్స్ అధికారులపై దాడి
విద్యుత్ విజిలెన్స్ అధికారులపై దాడి
Published Tue, Jan 17 2017 11:49 PM | Last Updated on Tue, Sep 5 2017 1:26 AM
- అన్నవరంలో ఘటన
– ఫోల్‌టు ఫోల్ వర్కర్‌పై పిడి గుద్దులు
– జలదుర్గం ఏఈతోపాటు పలువురికి గాయాలు
– పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు
– పదకొండు మందిపై కేసు నమోదు
కోవెలకుంట్ల/అవుకు: విద్యుత్ చౌర్యం అరికట్టేందుకు తనిఖీకి వెళ్లిన అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన సంఘటన మంగళవారం అవుకు మండలంలోని అన్నవరం గ్రామంలో చోటు చేసుకుంది. దాడిలో గాయపడిన బాధితులు అందించిన సమాచారం మేరకు వివరాలు.. జిల్లాలోని డోన్, నంద్యాల డీఈలు తిరుపాలు, నరేంద్రకుమార్‌రెడ్డి, విజిలెన్స్ డీఈ ఉమాపతి, ఏడీఈలు శివరాం, జార్జ్‌ఫెర్నాండేజ్, నంద్యాల డివిజన్‌లోని 20 మంది ఏఈలు, సబ్ ఇంజనీర్లు, తదితర 150 మంది సిబ్బందితో కూడిన విజిలెన్స్ బృందాలు అందిన సమాచారం మేరకు విద్యుత్ అక్రమ వాడకాన్ని అరికట్టేందుకు అవుకు మండలంలోని వివిధ గ్రామాల్లో దాడులు నిర్వహించేందుకు మండలానికి చేరుకున్నారు.
ఇందులో భాగంగా వెలుర్తి, కృష్ణగిరి, జలదుర్గం, ప్యాపిలి, డోన్ ఏఈలు నాగేష్‌రెడ్డి, ఖలీల్ పాషా, బాలస్వామి, వేణుగోపాల్, రమణారావు, ముగ్గురు సబ్ ఇంజనీర్లు, మరికొంత మంది సిబ్బంది అన్నవరం గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో అక్రమ విద్యుత్ వాడకంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తుండగా గ్రామస్తులు విద్యుత్ అ«ధికారులతో వాగ్వాదానికి దిగారు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు ఆకస్మిక తనిఖీ నిమిత్తం వచ్చినట్లు అధికారులు పేర్కొనగా గ్రామస్తులు ఆగ్రహంతో అసభ్య పదజాలంతో దూషిస్తూ అధికారులపై ఎదురుదాడి చేసి భౌతిక దాడులకు దిగారు. కొందరిని పిడిగుద్దులతో చితకబాదారు. అధికారులపై కర్రలతో దాడి చేయగా పలువురు గాయపడ్డారు.
ఈ ఘటనలో ఐదుగురు ఏఈలతో పాటు సిబ్బంది గాయపడ్డారు. గ్రామస్తులు దాడి చేసిన సంఘటనను బాధితులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాడులకు వెళ్లిన బృందాలు ఆయా గ్రామాల నుంచి నేరుగా బాధితుల వద్దకు వెళ్లి అక్కడ నుంచి అవుకు పోలీస్‌స్టేషన్‌ను చేరుకున్నారు. గ్రామంలో జరిగిన ఘటనపై ఫిర్యాదు చేయగా గ్రామానికి చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ఓ మహిళ బాత్‌రూంలో స్నానం చేస్తున్న సమయంలో విజిలెన్స్ అధికారుల బృందం ఇంటి ఆవరణకు చేరుకోవడంతో ఆ మహిళ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులపై ఎదురుదాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు విచారణలో తేలాల్సి ఉంది.
దాడి హేయామైన చర్య:
అన్నవరం గ్రామంలో విద్యుత్ చౌర్యంపై దాడులకు వెళ్లిన అధికారులపై గ్రామస్తులు దాడి చేయడం హేయమైన చర్యయని విద్యుత్ విజిలెన్స్ డీఈ ఉమాపతి, విజిలెన్స్ సీఐ సురేష్ కూమార్ రెడ్డి చెప్పారు. విషయం తెలిసిన వెంటనే వారు బాధితులతో కలిసి అవుకు పోలీస్‌స్టేషన్ చేరుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనిఖీకి వెళ్లిన అధికారులపై గ్రామస్తులు విచక్షణా రహితంగా కర్రలు, పిడిగుద్దులతో దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అధికారులు విధి నిర్వహణలో తనిఖీకి వెళితే దాడికి దిగడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ అధికారులు ప్రజలకు ఎలాంటి కీడు చేయరని, గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన లేకపోవడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు.
11 మందిపై కేసు నమోదు:
అన్నవరం గ్రామంలో విద్యుత్ అధికారులపై జరిగిన ఘటనలో గ్రామానికి చెందిన 11 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన శివరామిరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, పార్థసారధిరెడ్డి, కాశిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రంగారెడ్డి, వెంకటరామిరెడ్డి, బాలనాగిరెడ్డి, రాజేష్, శేఖర్, గోపాల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
Advertisement