పార్కు స్థలం ఆక్రమణకు ప్రయత్నం
-
రాత్రికి రాత్రే గోడ నిర్మాణం
-
గోడ కూల్చివేసి నిరసన వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్
నెల్లూరు(పొగతోట): చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని హెచ్‌పీ గోడౌన్ రోడ్డులో పార్కు కోసం కేటాయించిన కార్పొరేషన్ స్థలాన్ని టీడీపీ నాయకుడొకరు రాత్రికి రాత్రి ఆక్రమించే ప్రయత్నం చేశారు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలానికి చుట్టూ ప్రహరీ నిర్మించారు. విషయం తెలియడంతో 13వ డివిజన్ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య శుక్రవారం ఉదయం గోడ కూల్చి వేసి నిరసన లె లిపారు. వివరాలు..13, 14వ డివిజన్ల పరిధిలోని హెచ్‌పీ గోడౌన్ రోడ్డులో కార్పొరేషన్ అధికారులు 70 అంకణాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఈ స్థలం గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో స్థానికంగా ఉన్న అధికార పార్టీ నాయకుడొకరు దీనిపై కన్నేశారు. గురువారం రాత్రి పొద్దుపోయాక స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి ఇది తన భూమి చెప్పుకునే ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రి వెలసిన గోడపై ఆ ప్రాంతంలోని జనం భగ్గుమన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ మాధవయ్య అక్రమంగా నిర్మించిన గోడ కూల్చివేసి కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి గోడ నిర్మాణానికి వినియోగించిన బ్రిక్సును, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఈ విషయంపై మేయర్‌కు, కమిషనర్‌కు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్ ఇప్పటికైనా స్పందించి అక్రమణకు గురైన కార్పొరేషన్ స్థలాలకు పరిరక్షించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, ఎస్.జయరామిరెడ్డి, నవీన్‌రెడ్డి, గిరిప్రసాద్, భాస్కర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి, కృష్ణారెడ్డి, తారకేశ్వరరెడ్డి, ఓనర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.