ఆదురుపల్లిలో ఆటో - బైక్ ఢీ
చేజర్ల : మండలంలోని ఆదురుపల్లిలో ఆటో - బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కలువాయి మండలం రాజుపాళెంకు చెందిన ఐదుమంది అదే మండలంలోని వెదనపర్తి గ్రామంలో వివాహానికి హాజరయ్యారు. తిరిగి రాజుపాళెం వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. ఈ సమయంలో ఆదురుపల్లి గ్రామశివార్లలో ఎదురుగా వస్తున్న బైక్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న చేజర్ల మండలం తిరుపతినాయుడుపల్లికి చెందిన సాయికిరణ్ (21), ఆటోలో ప్రయాణిస్తున్న మహేష్ (6) అక్కడిక్కడే మృతిచెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న పొదలకూరుకు చెందిన రాము తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించగా పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతదేహాలను పొదలకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు మృతిచెందడంతో మహేష్ తల్లి రత్నమ్మ బోరును విలపించారు. ఆమెను ఓదార్చడం ఎవరి వల్లకకాలేదు. అక్కడ మహేష్‌ప్రమాద విషయం తెలుసుకున్న పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, చేజర్ల ఎస్‌ఐ బాజిరెడ్డి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డిగ్రీ విద్యార్థి మృతితో విషాదం
పొదలకూరు : సాయికిరణ్, తీవ్రంగా గాయపడిన రాములు పొదలకూరులో డిగ్రీ చదువుతున్నారు. సాయికిరణ్ దుర్మరణంతో పట్టణంలోని విజ్ఞాన్ డిగ్రీకాలేజీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి స్వగ్రామం చేజర్ల మండలం తిరుపతినాయుడుపల్లి కాగా వీరి కుటుంబం నెల్లూరు నగరంలో కాపురం ఉంటోంది. విజ్ఞాన్ కాలేజీలో బీఎస్సీ ఫైనలీయర్ చదువుతున్నాడు. రాము పొదలకూరు పద్మావతినగర్ వీధిలో నివాసం ఉంటున్నాడు. తండ్రి లేకపోవడంతో ఒక్కగానొక్క కొడుకుని తల్లి పనిచేస్తూ అల్లారుముద్దుగా పెంచుకుంటోంది. పట్టణంలోని కాకాతీయ డిగ్రీకాలేజీలో ఫైనలీయర్ చదువుతున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే చేజర్ల ఎస్‌ఐ తన జీపులో క్షతగాత్రులను పొదలకూరు వైపు తీసుకుని వస్తుండగా సమాచారం తెలుసుకుని ఎదురువెళ్లిన పొదలకూరు 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడిన రామును నెల్లూరు తీసుకెళ్లారు.