వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం
వెంకటాచలం, బాలాయపల్లి, ఓజిలి : జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వెంకటాచలం మండలంలో జరిగిన ప్రమాదంలో బాలాయపల్లి మండలానికి చెందిన వెంకటరత్నం, ఓజిలి మండలంలో జరిగిన ప్రమాదంలో అల్లూరు మండలానికి చెందిన శ్రీనివాసులు మృతిచెందారు.వెంకటాచలం : మోటారు బైక్‌ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన వెంకటాచలం మండలం సరస్వతీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. బాలాయపల్లి మండలం అంబలపూడి అరుంధతీవాడకు చెందిన దంతం వెంకటరత్నం (35) రెండురోజులు క్రితం భార్య శ్యామల, కుమార్తెలు చంద్రకళ (12సం, అంగవైకల్యం), చెంచుమహాలక్ష్మీ(2సం)ను తీసుకుని వెంకటగిరి మండలం కందనాలపాడు గ్రామంలో ఉన్న అత్తమామలను చూసేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం రత్నం తన తమ్ముడు వెంకటయ్య అత్త ఊరైన గూడూరు రూరల్ మండలం పారిచెర్లలో మాతమ్మ కొలుపుకి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. ఆదివారం ఉదయం వెంకటగిరికి వెంకటే ష్, రత్నం మోటారుబైక్‌పై వెంకటాచలం మండలం చవటపాళెం గ్రామానికి వచ్చారు. తిరిగి వెళ్తుండగా సరస్వతీనగర్ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతున్న క్రమంలో నెల్లూరు వైపు నుంచి వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది. ఈప్రమాదంలో రత్నం, వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనచోదకులు టోల్‌ప్లాజా అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వారు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రత్నం మృతిచెందాడు. పోలీసులు అతడి మృతదేహానికి పోస్టుమార్టం చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన కారు కోసం వెతుకుతున్నారు.మా నాయన ఇక రాడా?రత్నం మృతదేహాన్ని అంబలపూడికి తీసుకువచ్చిన తర్వాత రోదనలు మిన్నంటాయి. మృతుడి పిల్లలు ‘చిన్నమ్మ మానాయన ఇక రాడా.. చెరువులో ఎర్రగుడ్డ కింద ఎందుకు పడుకోపెట్టారు.. అమ్మ ఎందకు ఏడుస్తుంది? మాకు నాయన లేడా? నెల్లూరు నుంచి సైకిల్ తెస్తామన్నాడు.. ఎప్పుడు తెస్తాడు? అడగడం స్థానికులను కంటనీరు పెట్టించింది.దైవదర్శనానికి వెళ్తూ..ఓజిలి : తిరుత్తణి సుబ్రహణ్యస్వామి కావడి తీసుకుని వెళ్తుండగా కారు అదుపుతప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లి నాశిన శ్రీనివాసులు(40) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు సమాచారం మేరకు.. అల్లూరు మండలం పురిణి గ్రామానికి చెందిన శ్రీనివాసులు తన భార్య సునీత, బావమరిది జానా బాబు, ముగ్గురు పిల్లలతో కలిసి మధ్యాహ్నం కారులో తిరుత్తణికి బయలుదేరాడు. ఈ క్రమంలో ఓజిలి క్రాస్ సమీపంలోని శ్రీకృష్ణా న ర్సరీ వద్ద కారు ముళ్లచెట్లలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందాడు. మిగిలిన ఐదుమందికి స్వల్పగాయలైయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సాంబశివరావు సంఘటన స్థలం చేరుకుని ప్రమాదంపై ఆరాతీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.