చోరీ కేసులో ఆటోడ్రైవర్ల అరెస్టు
మచిలీపట్నం (కోనేరుసెంటర్) :
బంగారు ఆభరణాల చోరీ కేసులో ముగ్గురు ఆటో డ్రైవర్లను ఇనగుదురుపేట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి 46 గ్రాముల ఆభరణాలను స్వా«ధీనం చేసుకున్నారు. ఇనగుదురుపేట సీఐ సాయిప్రసాద్ స్థానిక స్టేషన్‌లో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన కథనం మేరకు.. మచిలీపట్నంలోని నవీన్‌మిట్టల్‌కాలనీ, జవ్వారుపేట, మగ్గాలకాలనీకి చెందిన తోకాడ పవన్, ఎండి.షరీబుద్దీన్, అంతటి దుర్గారావు స్నేహితులు. వారంతా ఆటో డ్రైవర్లు. మే 15వ తేదీన రాజుపేటకు చెందిన రిటైర్డు ఉద్యోగి దేవిశెట్టి వెంకటేశ్వరరావు కుటుంబం సభ్యులతో మేడపై నిద్రిస్తుండగా దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి 46 గ్రాముల బంగారు ఆభరణాలు, కెమేరా అపహరించారు. నిద్రిస్తున్న వెంకటేశ్వరరావు వద్ద ఉన్న సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం వెంకటేశ్వరరావు ఇనగుదురుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీ సులు దర్యాప్తుచేపట్టారు. ఈ నెల 18న షరీబుద్దీన్, దుర్గారావు, పవన్ మచిలీపట్నంలోని మూడు స్తంభాల సెంటర్‌లో అనుమానాస్పదంగా సంచరించడాన్ని గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వెంకటేశ్వరరావు ఇంట్లో చోరీకి పాల్పడింది తామేనని ముగ్గురు నేరాన్ని అంగీకరించారు. వారి నుంచి రెండు పేటల బంగారు నానుతాడు, రెండు ఉంగరాలు, సెల్‌ఫోన్, కెమేరా, ఆటో స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ డి.దుర్గామహేశ్వరరావు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.