‘ఆటోమెటిక్‌’ బ్రేక్‌ | 'autometic' break | Sakshi
Sakshi News home page

‘ఆటోమెటిక్‌’ బ్రేక్‌

Published Tue, Aug 23 2016 9:34 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

‘ఆటోమెటిక్‌’ బ్రేక్‌

‘ఆటోమెటిక్‌’ బ్రేక్‌

ఇన్నాళ్లు కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులు వ్యవసాయ బావుల వద్ద జాగారాలు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం వ్యవసాయరంగానికి రోజుకు రెండు విడతల్లో తొమ్మిది గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం ఆరుగంటలు, రాత్రి 3గంటలు ఇస్తున్నారు. వ్యవసాయమోటార్లకు రైతులు బిగించుకున్న ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించే

  • సీఎండీ కార్యాలయం నుంచి ఆదేశాలు
  • ట్రాన్స్‌ఫార్మర్లకు భారమంటూ కొర్రీలు
  • ఆటోమెటిక్‌ స్టార్లర్లు తొలగింపుకు స్పెషల్‌డ్రైవ్‌
  • రైతుల్లో నిరసన
  •  జగిత్యాల అగ్రికల్చర్‌/సారంగాపూర్‌: ఇన్నాళ్లు కరెంట్‌ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో రైతులు వ్యవసాయ బావుల వద్ద జాగారాలు చేసేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ప్రభుత్వం వ్యవసాయరంగానికి రోజుకు రెండు విడతల్లో తొమ్మిది గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేస్తోంది. మధ్యాహ్నం ఆరుగంటలు, రాత్రి 3గంటలు ఇస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయమోటార్లకు రైతులు బిగించుకున్న ఆటోమెటిక్‌ స్టార్టర్లను తొలగించే పనిలో పడింది.  ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడుతోందని అన్నదాతలపై ఒత్తిడిపెంచుతోంది. తొలగించుకోకుంటే ఏకంగా కేసుల నమోదు సిద్ధమవుతున్నారు ట్రాన్స్‌కో అధికారులు. ఈ మేరకు సీఎండీ కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు అందాయి. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. 
     
    సెల్ఫ్‌స్టార్టర్‌ అంటే..
    ఫ్యూజ్‌ బాక్స్‌లో ఆటోమెటిక్‌ స్టార్టర్‌ ఉంటుంది. మనిషి అవసరం లేకుండా కరెంట్‌ రాగానే విద్యుత్‌ మోటార్‌ సెల్ఫ్‌స్టార్టర్‌తో దానికదే ఆన్‌ అవుతుంది. దీంతో రైతులు రోజుకు రెండు మూడుసార్లు పొలం దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. కేవలం బావిలో నీళ్లు ఉంటే చాలూ. ఆటోమెటిక్‌ స్టార్టర్‌ ధర  కంపెనీలను బట్టి రూ.200–500 లోపే ఉంటుంది. ఉచిత విద్యుత్‌ ఇస్తుండడంతో వ్యవసాయ బావి, బోరు ఉన్న ప్రతీ రైతు ఆటోమెటిక్‌ స్టార్టర్‌ను అవసరానికి మించి ఉపయోగిస్తున్నారు. 
     
    ఎందుకు వినియోగంలోకి వచ్చాయి?
    తెలుగుదేశం పాలనలో తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఆటోమెటిక్‌ స్టార్టర్ల వినియోగం పెరిగింది. తరచూ విద్యుత్తు పోతుండడం, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. గంటలో లెక్కకు మించి ట్రిప్‌ కావడంతో రైతులు పొలాల వద్దే పడుకునేవారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఆటోమెటిక్‌స్టార్టర్లను వినియోగంలోకి విరివిగా తీసుకొచ్చారు. ఆ తరువాత వైఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో వ్యవసాయానికి ఏడుగంటల విద్యుత్‌ను ఉచితంగా అందించడం, దానికి తగినట్లు వర్షాలు కురవడంతో విద్యుత్‌ వినియోగంతోపాటు పంటల సాగువిస్తీర్ణం రెండింతలు పెరిగింది. దీంతో ఆటోమెటిక్‌ స్టార్టర్ల వినియోగం మరింత పెరిగింది.
     
    ఆటోమెటిక్‌ స్టార్టర్లతో నష్టమేమిటంటే..?
    రైతులు తమ పంటపొలాల్లో ఎక్కువగా 3హెచ్‌పీ విద్యుత్‌  మోటార్లను వినియోగిస్తున్నారు. ఒక్క 3 హెచ్‌పీ మోటార్‌కు విద్యుత్‌  సరఫరా రాగానే 8ఆంప్స్‌ విద్యుత్‌ను తీసుకుంటుంది. ఆ తర్వాత అది 3నుంచి 4ఆంప్స్‌ వరకు వచ్చి ఆగిపోతుంది. విద్యుత్తు సరఫరా రాగానే ఆటోమెటిక్‌ స్టార్టర్ల ద్వారా మోటార్లు ఏకకాలంలో ఆన్‌కావడంతో సబ్‌స్టేషన్‌లో ఎక్కువ లోడ్‌ పడుతుంది.సబ్‌స్టేషన్‌లో బ్రేకర్‌ ఆన్‌చేయగానే 200 ఆంప్స్‌ విద్యుత్‌ సరఫరా అయ్యేలా టెక్నికల్‌గా ఏర్పాటుచేస్తారు. ఆటోమెటిక్‌ స్టార్టర్లతో ఒక్కసారిగా సబ్‌స్టేషన్‌లో విద్యుత్‌ సరఫరా ఆన్‌చేయగానే 400 నుంచి 500 ఆంప్స్‌ వినియోగం జరిగి బ్రేకర్లు ట్రిప్‌ కావడం, ట్రాన్స్‌ఫార్మర్ల మీద అధిక భారం పడి ఫ్యూజ్‌లు పోతాయి. కొన్నిసార్లు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు పెద్దఎత్తున మరమ్మతు వస్తున్నట్లు అధికారుల వాదన. మామూలు స్టార్టర్లుమాత్రమే ఉండాలంటూ ఆదేశాలు వచ్చాయంటూ చెబుతున్నారు. రైతులకు విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ, ఆటోమెటిక్‌ స్టార్టర్లు, మాములు స్టార్టర్లపై సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించాలని డిస్కం అధికారులు భావిస్తున్నారు.
     
    తొలగింపు షురూ...
    ఆటోమేటిక్‌ స్టార్టర్లను సాధ్యమైనంత తొందరగా రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే కేసులు పెట్టనున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు గ్రామాల్లో డప్పు చాటింపు వేయిస్తున్నారు. ఆదివారం ఒక్క రోజే సారంగాపూర్‌ మండలం కొల్వాయి గ్రామంలో 20, లక్ష్మీదేవిపల్లిలో 35 ఆటోమెటిక్‌ స్టార్టర్లు తొలగించారు. ఈక్రమంలో లక్ష్మీదేవిపల్లి రైతులకు, అధికారులకు మధ్య  వాగ్వివాదం జరిగింది.
     
    ఇది అన్యాయం
    –ఎండీ. ఇబ్రహీం, సారంగాపూర్‌
    తొమ్మిది గంటలు విద్యుత్‌ సరఫరా అన్న మాటేగానీ  సరఫరా ఏ మాత్రం బాగాలేదు. ఆటోమెటిక్‌ స్టార్టర్లు తొలగిస్తే రైతులు పొలాల వద్దే పడుకోవాల్సి వస్తుంది. తరచూ కరెంటు పోతుంది. సబ్‌స్టేషన్‌కు ఫోన్‌ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు.
     
    అవగాహన కల్పిస్తున్నాం 
    –కృష్ణయ్య, ఎలక్ట్రికల్‌  డీఈ, జగిత్యాల
    సెల్ప్‌స్టార్టర్లపై రైతులకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం.  సెల్ఫ్‌స్టార్లర్లతో పడే సమస్యలను విద్యుత్‌ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. ఒక ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే ప్రభుత్వానికి దాదాపు లక్షకు పైగా ఖర్చు వస్తుంది.
     
    అధికారులు ఆలోచించాలి
    –టి.జీవన్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే
    ఆటోమేటిక్‌ స్టార్టర్లు తొలగిస్తే రైతులు ఇబ్బందులు పడుతారు. రాత్రి పూట పొలాల వద్దకు వెళ్తే పాములు, ఇతర జంతువులతో ప్రమాదాల బారిన పడతారు. తరచూ విద్యుత్‌పోవడంతో అన్నదాతలు పొలాల వద్దే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఆలోచించాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement