గుర్తుతెలియని శవం ఆచూకీ లభ్యం
Published Wed, Jul 20 2016 1:21 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
జఫర్‌గఢ్ : అనుమానాస్పదస్థితిలో జఫర్‌గఢ్ శివారు నల్లబండ వద్ద లభ్యమైన గుర్తు తెలియని యువకుడి శవం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై బండారి సంపత్ తెలిపారు. స్థానికుల ద్వారా సోమవారం వెలుగులోకి రావడం జరిగింది. మృతుడు ఎవరన్నది తెలియకపోవడంతో పోలీసులు ఎంజీఎం మార్చురిలో భద్రపర్చారు. పత్రికలో వచ్చిన ఫొటో, కథనాల ఆధారంగా ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామానికి చెందిన కుల్లా సంపత్, నిర్మల దంపతులు మంగళవారం మార్చురికి వచ్చి తమ కుమారుడు మహేశ్ (24)గా గుర్తిం చారు. కాగా వీరిది స్వగ్రామం జఫర్‌గఢ్ శివారు వడ్డెగూడెం అయినప్పటికీ కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం ఉనికిచర్లకు వెళ్లి అక్కడనే స్థిరపడ్డారు. కుమారుడి మృతిపై తల్లిదండ్రులు, బంధువులు తమ అనుమానాన్ని వ్యక్తం చేశారు.
మృతుడు హన్మకొండ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఎ పూర్తి చేశాడు. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో తన స్మేహితుల వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. చదువుతున్న సమయంలోనే ఐదు నెలల క్రితం వరంగల్‌లోని ఓ గోల్డ్ షాపులో పనిచేశాడు. ఇటీవల మహేశ్ తాత కుల్లా సాయిలు మృతి చెందడంతో 10 రోజుల పాటు తన స్వగ్రామమైన వడ్డెగూడెంలోనే ఉంటున్నాడు. ఈ సమయంలోనే మృతుడు తాను మృతి చెందిన నల్లబండ వద్ద తన స్నేహితులతో కలిసి విందు పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. తాత దశదినకర్మ పూర్తయిన తర్వాత మహేశ్ తన తల్లిదండ్రులతో కలిసి ఉనికిచర్లకు వెళ్లాడు. తర్వాత మహేశ్ తన ఇంటి నుంచి నాలుగు రోజుల క్రితం హన్మకొండకు వెళ్లినట్లు తెలిసింది. ఎప్పటి లాగానే తమ కుమారుడు స్నేహితుల వద్దనే ఉన్నాడని భావించిన తల్లిదండ్రులు పత్రికల్లో వచ్చిన ఫొటోల ఆధారంగా గుర్తించారు. మహేశ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మహేశ్ మృతిపై ఇప్పటి వరకు ఎలాంటి కారణాలు తెలియరాలేదని ఎస్సై సంపత్ తెలిపారు.
Advertisement
Advertisement