వెల్లివిరిసిన క్రీడానందం
Published Mon, Aug 29 2016 10:26 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
268 మందికి నగదు ప్రోత్సాహకాలు
సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చొరవను అభినందించిన ఎమ్మెల్యేలు అనిల్, కోటంరెడ్డి
ఇకపై రాష్ట్ర స్థాయిలో ప్రోత్సాహకాలు అందజేస్తామన్న చైర్మన్ ముక్కాల
నెల్లూరు(బందావనం): జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా నెల్లూరులో సోమవారం సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో క్రీడానందం వెల్లివిరిసింది. జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ క్రీడల్లో రాణించిన 268 మంది క్రీడాకారులు నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపికలు అందుకున్నారు. ఫౌండేషన్ చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హాజరయ్యారు.
ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు
ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించి ప్రణాళికబద్ధంగా ప్రోత్సహిస్తే మెరికల్లా తయారై అద్భుత ఫలితాలు సాధిస్తారని ఎమ్మెల్యే అనిల్ అన్నారు. దేశంలో క్రీడాకారుల, ప్రతిభ కొరవలేదని, కొరవడింది ప్రోత్సాహమేనన్నారు. క్రీడారంగానికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగా ఉందన్నారు. ఈ క్రమంలో సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చొరవ ప్రశంసనీయమన్నారు.
అభినందనీయం
ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే ఎందరో క్రీడాకారులు పుట్టుకొస్తారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహిస్తే ఉత్తమ ఫలితాలు సాధించగలరన్నారు. జిల్లా క్రీడాకారులకు సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు.
త్వరలో బ్యాడ్మింటన్ అకాడమీ
త్వరలో జిల్లా క్రీడారంగానికి మహర్దశ కలగనుందని డీఎస్‌డీఓ పీవీ రమణయ్య అన్నారు. ఏసీ స్టేడియంలో బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు.
వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థాయి పురస్కారాలు
వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు అందజేస్తామని సింహపురి స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ తెలిపారు. క్రీడాపరంగా సింహపురి ఖ్యాతిని జాతీయస్థాయిలో ఇనుమడించాలన్నదే తమ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మొదట మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కోశాధికారి పసుపులేటి రామమూర్తి,, జిల్లా పోలీస్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు ఎం.ప్రసాద్‌రావు, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.వి. వెంకట్, సభ్యులు సరాబు సుబ్రహ్మణ్యం, శ్రీరాంసురేష్, అమరా వెంకటేశ్వర్లు, వేల్చూరి సురేష్, సత్యకష్ణ, కె.వీరబ్రహ్మం, కార్పొరేటర్ ఓబిలిరవిచంద్ర, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జీపీ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement