ప్లాస్టిక్ వినియోగిస్తే చర్యలు తప్పవు
► మున్సిపల్ అధికారులు హెచ్చరిక
► జిల్లాకేంద్రంలో అవగాహన ర్యాలీ
నిర్మల్‌రూరల్ : నిషేధిత ప్లాస్టిక్, పాలిథిన్ సంచులను వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ డీఈ సంతోష్ హె చ్చరించారు. జిల్లాకేంద్రంలో బుధవారం ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం–ప్రకృతిని కాపాడుదాం అంటూ మున్సిపల్ సిబ్బంది బ్యాండ్ చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రధాన వీధుల్లో ర్యాలీగా సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణానికి, మానవాళికి ముప్పుగా పరిణమిస్తున్న నిషేధిత ప్లాస్టిక్, పాలిథిన్ సంచులు, వస్తువులను వాడొద్దన్నారు.
ఆంక్షలను పట్టించుకోకుండా 40 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న పాలిథిన్ కవర్లను వినియోగించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ సంచులను కాకుండా జనపనార, గుడ్డతో చేసిన చేతిసంచులను ఉపయోగించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ ఆర్‌ఓ మోహన్, సానిటరీ ఇన్ స్పెక్టర్ మురారి, బల్దియాలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.