
హరిత చైతన్యం..
- హరితహారానికి మద్దతు పలికిన గొల్లకుర్మలు
- బీడుగా ఉన్న 84 ఎకరాల్లో నాటిన లక్ష మొక్కలు
- వారి చొరవను అభినందించిన ఎమ్మెల్యే
దుబ్బాక రూరల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న హరితహారానికి గొల్లకుర్మలు చైతన్యవంతులై ముందుకు వచ్చారు. తమ సొంత భూముల్లో వేలాది మొక్కలు నాటారు. దుబ్బాక నగర పంచాయతీ పరిధిలోని మల్లన్నగుట్ట సమీపంలో సర్వే నంబర్ 117, 129లో గల దుబ్బాకకు చెందిన గొల్లకుర్మ యాదవ సంఘానికి 84 ఎకరాల భూమి ఉంది. ఈ సంఘంలోని సభ్యులైన 39మంది హరితహారానికి జైకొట్టారు. వారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రాళ్లు, రప్పలతో కూడుకున్న ఈ భూమిని వారే స్వయంగా చదును చేసి గుంతలు తవ్వి లక్ష మొక్కలు నాటారు. అల్లనేరేడు, చింత, జామ, నీలగిరి, సీతాఫలం తదితర మొక్కలు నాటారు. లక్ష మొక్కలు నాటడంతో 84 ఎకరాలు హరితహారంతో కళకళలాడుతోంది. వారి కృషిని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అభినందించారు. లక్ష మొక్కలు నాటడం చాలా గర్వ కారణమన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
గర్వకారణం..
గొల్లకుర్మ యాదవ సం ఘం వారు 84 ఎకరాల్లో లక్ష మొక్కలు నాటడం అభినందనీయం. బీడు భూమిని ఈ విధంగా వినియోగంలోకి తేవడం సంతోషకరం.
– భోగేశ్వర్, దుబ్బాక నగర పంచాయతీ కమిషనర్
మరిన్ని మొక్కలు నాటుతాం..
ఎమ్మెల్యే కృషితో నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు మొక్కలు నాటారు. మల్లన్నగుట్ట సమీపంలో 84 ఎకరాల్లో గొల్లకుర్మ యాదవ సంఘం వారు లక్ష మొక్కలు నాటడం అభినందనీయం. ఇందులో ఎమ్మెల్యే కృషి ఎంతో ఉంది.
– బట్టు ఎల్లంయాదవ్, టీఆర్‌ఎస్ నేత