రైలుకు ఎదురెళ్లి విద్యార్థి ఆత్మహత్య
♦ కళాశాల యాజమాన్యం
♦ మందలించడంతో మనస్తాపం
♦ జెట్టిపాలెం గ్రామంలో విషాద ఛాయలు
మొగల్తూరు :
కళాశాల యాజమాన్యం మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటంబంలో విషాదాన్ని నింపింది. ఏకైక కుమారుడును పోగొట్టుకున్న తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని రామన్నపాలెం పంచాయతీ జెట్టిపాలెంకు చెందిన అడపా వెంకటేశ్వరరావు, శాంతమణిల ఏకైక కుమారుడు మణికంఠ. సీతారాంపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 24న కాలేజీ యాజమాన్యం మందలించడంతో దిగాలుగా ఇంటికి చేరుకున్న మణికంఠ మనస్తాపంతో 25న ఉదయం ఇంట్లోంచి బయటకు వచ్చాడు.
అదే రోజు కుటుంబ సభ్యులు, బంధువులు మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి మణికంఠ ఆచూకీ కోసం వెతకడం మొదలు పెట్టారు. పోలీసులు నరసాపురం రైల్వేస్టేషన్‌లో సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా విజయవాడ వైపు వెళ్లే రైలు ఎక్కినట్టు తెలిసింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతంలో గాలింపు చేపట్టారు. అయితే తెనాలి రైల్వే ట్రాక్‌పై ఓ యువకుని మృతదేహం పడి ఉందని, మార్చురీలో భద్రపర్చారని ఈ నెల 29న సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఆక్కడ రైల్వే పోలీసులను సంప్రదించారు.
25వ తేదీ సాయంత్రం రైలుకు ఎదురెళ్లి ఆత్యహత్యకు పాల్పడ్డాడని, శవాన్ని మార్చురిలో భద్రపర్చామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకుంది మణికంఠ అని కుటుంబ సభ్యులు గుర్తించి మృతదేహాన్ని జెట్టిపాలెంకు తీసుకువచ్చారు. మణికంఠ మృతితో జెట్టిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.