తూర్పుగోదావరి జిల్లా తుని కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో అరెస్టయిన వారిలో నలుగురు నిందితులకు పిఠాపురంలోని జిల్లా కోర్టు శుక్రవారం బెయిలు మంజూరు చేసింది. మరో ముగ్గురికి కాకినాడలోని సీబీసీఐడీ కోర్టు బెయిల్ తిరస్కరించింది.
కురాకుల పుల్లయ్య(విరవాడ), చక్కపల్లి సత్తిబాబు(ధర్మవరం), లగుడు శ్రీనివాసు(కోతనందురు), పి.శ్రీహరిబాబు (కోలంక)లను పోలీసులు తుని ఘటన కేసులో ఈ నెల 7న అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరు పరచగా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వీరు బెయిల్ కోసం పిఠాపురంలోని జిల్లా కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా... శుక్రవారం కోర్టు బెయిలు మంజూరు చేసింది.
అలాగే, ఇదే కేసులో అరెస్ట్ అయిన నల్లా విష్ణుమూర్తి (అమలాపురం), రామకృష్ణ(గోపాలపురం), వాసిరెడ్డి ఏసుదాసు (కాకినాడ)లు కాకినాడలోని సీబీసీఐడీ కోర్టులో బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు శుక్రవారం వాటిని కొట్టివేసింది. పిఠాపురం జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన లగుడు శ్రీనివాసును సీఐడీ పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కాకినాడలోని సీబీసీఐడీ కోర్టు మేజిస్ట్రేట్ శశాంకర్ ఆదేశించారు.