
ఆగిన బల్లకట్టు.. ప్రయాణికుల ఆందోళన
- సాంకేతికలోపమే కారణం.. మరమ్మతుల అనంతరం ఒడ్డుకు..
మేళ్లచెర్వు : నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలంలోని చింత్రియాల వద్ద నిర్వహిస్తున్న బల్లకట్టు శనివారం సాయంత్రం సాంకేతిక లోపంతో కృష్ణానదిలో నిలిచిపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బల్లకట్టు గుంటూరు జిల్లా వైపు నుంచి లారీతోపాటు ప్రయాణికులను ఎక్కించుకుని మేళ్లచెర్వు మండలం చింత్రియాలవైపు వస్తుండగా.. సాంకేతికలోపం తలెత్తింది.
దీంతో అది నది మధ్యలోనే నిలిచిపోయింది. ఇలా గంటసేపు నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. నిర్వాహకులు ఇంజన్‌కు మరమత్తులు చేయించి ఒడ్డుకు తేవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.