బార్ల లైసెన్సు మూడు నెలల పొడిగింపు
-
సారా, గంజాయి విక్రయాలపై సమాచారం అందిస్తే బహుమతులు
-
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు
నెల్లూరు(క్రైమ్) : బార్ల లైసెన్సు కాలపరిమితిని మరో మూడునెలలు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీచేసిందని నెల్లూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.శ్రీనివాసరావు వెల్లడించారు. మంగళవారం ఆయన నెల్లూరులో విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 39 బార్లు ఉన్నాయని, వీటి కాలపరిమితి ఈనెలాఖరకు ముగియనుందన్నారు. నూతన పాలసీ రాకపోవడంతో లెసెన్సును డిసెంబర్ నెలాఖరు వరకు పొడిగించారన్నారు. జనవరి నుంచి నూతన పాలసీ అమలులోకి రానుందన్నారు. గాంధీజయంతి సందర్భంగా అక్టోబర్ రెండవ తేదీ జిల్లాలో మద్యం అమ్మకాలను నిషేధించామన్నారు. డ్రైడే రోజు మద్యం విక్రయాలు సాగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆ రోజు విస్తృత తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 256 బెల్టుషాపులపై కేసులు నమోదు చేసి 248 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. 800 లీటర్ల మద్యం, 150 లీటర్ల బీర్‌బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎమ్మార్పీ ఉల్లంఘించిన 23 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి రూ.23 లక్షలు జరిమానా విధించామన్నారు. సమయపాలన పాటించని 40 మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేసి ఒక్కో దుకాణం నుంచి రూ.5 వేలు జరిమానా వసూలు చేసినట్లు చెప్పారు. ఇంకా నిబంధనలు పాటించని 44 దుకాణాలపై కేసులు నమోదు చేశామన్నారు. సిబ్బంది విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలు అమలయ్యేలా చూడాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా మద్యం, మత్తు పదార్ధాల వల్ల సంభవించే అనర్ధాలపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లాలో నవోదయం కార్యక్రమం ద్వారా సారాను కట్టడిచేశామన్నారు. ఇంకా ఎవరైనా సారాయి, గంజాయి విక్రయాలు సాగిస్తుంటే తమకు సమాచారం అందించాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు సమాచారం అందించిన వారికి నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.