అపర అన్నదాత బసివిరెడ్డి | basivireddy jayanthi special | Sakshi
Sakshi News home page

అపర అన్నదాత బసివిరెడ్డి

Published Tue, Jun 6 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

అపర అన్నదాత బసివిరెడ్డి

అపర అన్నదాత బసివిరెడ్డి

నేడు సామర్లకోటలో జయంతి 
విక్టోరియా మహారాణి నుంచి ప్రశంసాపత్రం పొందిన బసివిరెడ్డి
విద్యార్థుల ఉపకార వేతనాల పంపిణీకి ఏర్పాట్లు
సామర్లకోట (పెద్దాపురం) : అన్నదాతగా పేరొందిన కొవ్వూరి బసివిరెడ్డి జయంతిని బుధవారం నిర్వహించనున్నారు. ఇందుకు దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సామర్లకోటలోని బసివిరెడ్డి సత్రానికి, బసివిరెడ్డి విగ్రహానికి రంగులు వేస్తున్నారు. 1852లో జన్మించిన కొవ్వూరి బసివిరెడ్డి సామర్లకోట రైల్వే స్టేషన్‌ సమీపంలో సుమారు పదెకరాల విస్తీర్ణంలో 1880లో సత్రాన్ని నిర్మించారు. దాని నిర్వహణకు కాకినాడలో గోదాములు ఏర్పాటు చేశారు. తరువాతి కాలంలో గోదాములను విక్రయించగా వచ్చిన సొమ్మును బ్యాంకులో డిపాజిట్‌ చేశారు. సత్రం ప్రారంభం నుంచి బాటసారులకు ఇక్కడ భోజన ఏర్పాట్లు చేశారు. సామర్లకోట రైల్వే జంక‌్షన్‌ కావడంతో రైలు ప్రయాణికులు సామర్లకోటలో దిగి సత్రంలో భోజనాలు చేసేవారు. 1897లో బ్రిటిష్‌ మహారాణి అయిన విక్టోరియా మహారాణి మద్రాసు మెయిల్‌ ప్రయాణిస్తూ ట్రెయిన్‌ సామర్లకోటలో నిలిచిపోవడానికి బసివిరెడ్డి సత్రం అన్నదానం కారణమని తెలుసుకుని ఆయనకు ప్రసంశాపత్రాన్ని అందజేశారు. కొవ్వూరి బసివిరెడ్డి 1915లో మరణించారు. బసివిరెడ్డి సత్రానికి ఆస్తులు ఉండటంతో దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ సత్రం వ్యవస్థాపకుడి జయంతిని తిది ప్రకారం జూన్‌ 7న నిర్వహిస్తున్నారు. గతేడాది జూన్‌ 11న జయంతి వేడుకలు జరిగాయి. బాటసారుల సంఖ్య క్రమేపీ తగ్గిపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి సామర్లకోట, పెద్దాపురం పరిసర ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీ చదువుకునే  సుమారు 40 మంది విద్యార్థులకు ఏటా ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పించే వారు. అయితే సత్రం శిథిలం కావడంతో మూడేళ్లుగా విద్యార్థులకు ఆ సౌకర్యాలు నిలిపివేసి బసివిరెడ్డి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. కాలక్రమంలో సత్రం ఆస్తులు హరించుకుపోయాయి. సత్రానికి మిగిలిన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నుంచి అద్దెల రూపంలో వస్తున్న ఆదాయంతో ప్రస్తుతం సత్రం నిర్వహణ జరుగుతోంది. బసివిరెడ్డి జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అన్ని కోర్సుల్లోని ఉత్తమ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని నిర్ణయించారు. కళాశాలలోని ఎంపీసీ గ్రూపు నుంచి గండేపల్లి నాగేంద్ర, బైపీసీ నుంచి రామిశెట్టి సునీత, సీఈసీ నుంచి పైపూరి రాజేష్, హెచ్‌ఈసీ నుంచి కాకర సూర్య, ఎఈటీ నుంచి జక్కంపూడి శ్రీహరి, సీఎస్‌ఈ నుంచి కంచుమర్తి సుష్మ, ఈటీ నుంచి అంజూరి శ్రీహర్షవర్ధన్, ఎంఈటీ నుంచి పెంకే రాంబాబు, సీజీటీ నుంచి చుండ్రు వీరదుర్గ, ఎంపీహెచ్‌డబ్లూ నుంచి తాతపూడి దుర్గలు ఉపకార వేతనాలకు ఎంపిక చేసి, ఆ జాబితాను సత్రానికి అందజేసినట్టు జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఐ.శారద తెలిపారు. బసివిరెడ్డి జయంతి సందర్భంగా వంశ పారంపర్య ధర్మకర్త అయిన కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి ఈ ఉపకార వేతనాలను ఉత్తమ విద్యార్థులకు అందజేస్తారు. బవిసిరెడ్డి çసత్రంలోని కొంత స్థలాన్ని బస్‌ కాంప్లెక్స్‌ , మరికొంత స్థలాన్ని టీటీడీ కల్యాణ మండపాల నిర్మాణాలకు ఉచితంగా ఇచ్చారు. స్థలం ఇచ్చిన సమయంలో కల్యాణ మంటపానికి బసివిరెడ్డి పేరు పెడతామని హామీ ఇచ్చినా పెట్టలేదు. ఇటువంటి దాతను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది దాతలు ముందుకు వస్తే పేద విద్యార్థులకు కొంత వరకు చేయూత ఇచ్చిన వారవుతారు. సత్రం పూర్తిగా శిథిలం కావడంతో నూతన భవన నిర్మాణానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సత్రానికి ఉన్న షాపుల ద్వారా ఏడాదికి రూ.6.73 లక్షలు, విరాళాలుగా రూ.80 వేల ఆదాయం వస్తుంది. ఫిక్సెడ్‌ డిపాజిట్లుగా రూ.20,70, 039 ఉన్నాయని సత్రం అధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement