గడువుకు ముందే ‘మిషన్‌’ పూర్తి | Before the deadline 'mission complete | Sakshi
Sakshi News home page

గడువుకు ముందే ‘మిషన్‌’ పూర్తి

Published Mon, Sep 26 2016 11:52 PM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM

ఇన్‌టేక్‌వెల్‌ను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు - Sakshi

ఇన్‌టేక్‌వెల్‌ను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • ఇంటింటికీ తాగునీరందిస్తాం..
  • ‘భక్త రామదాసు’ను నవంబర్‌లో రైతులకు అంకితం చేస్తాం..
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • కూసుమంచి : 2017కు ముందే మిషన్‌ భగీరథ పథకం పనులు పూర్తి చేసి.. ఇంటింటికీ తాగునీరు సరఫరా చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు రిజర్వాయర్‌లో నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్‌ పనులను మంత్రి సోమవారం పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆదివారం రింగ్‌బండ్‌ కట్ట తెగిపోయి.. ఇన్‌టేక్‌వెల్‌కు నీరు చేరిందని, దీనివల్ల ప్రమాదమేమీ లేదని, ప్రస్తుతం నీరు చేరిన ప్రాంతంలో పనులు పూర్తయ్యాయని అన్నారు. మిగిలిన పనులు అక్టోబర్‌ నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. జిల్లాలో రూ.3,558కోట్లతో ఐదు సెగ్మెంట్లలో  భగీరథ పనులు కొనసాగుతున్నాయని, దీంతోపాటు మరో రూ.వెయ్యి కోట్లతో గ్రామాల్లో పైపులైన్లు వేసి  ఇంటింటికీ నల్లాలు బిగిస్తామని అన్నారు. జిల్లాలో డిసెంబర్‌ నాటికి 388 గ్రామాలకు, 2017 జనవరిలో 300 గ్రామాలకు, మార్చిలో 746 గ్రామాలకు, సెప్టెంబర్‌లో 560 గ్రామాలకు, డిసెంబర్‌లో 674 గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు.
    రబీకి సాగర్‌ నీళ్లు తెప్పిస్తా..
    జిల్లాలో వచ్చే రబీ పంటకు సీఎంతో మాట్లాడి సాగురు తెప్పిస్తానని మంత్రి తుమ్మల అన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలతో పాలేరు నిండిందని, దీంతో నీటిని ఎడమ కాలువకు వదిలి పలు చెరువులు నింపుతున్నామని అన్నారు. రైతులు ఇప్పుడు నాట్లు వేసుకోవటం మంచిది కాదని, నవంబర్‌ 15 తరువాత నాట్లు వేసుకోవాలని సూచించారు. ఎక్కడైనా రోడ్లు కోతకు గురైతే వెంటనే అధికారులు చర్యలు చేపట్టి.. రాకపోకలు పునరుద్ధరిస్తున్నారని వివరించారు.
    నవంబర్‌ నాటికి ‘భక్త రామదాసు’ నీళ్లు
    భక్త రామదాసు ఎత్తిపోతల పథకం పనులు పూర్తి కావొచ్చాయని, నవంబర్‌ మొదటి వారంలో ట్రయల్‌ రన్‌ వేసి నెలాఖరులోగా చెరువులకు సాగర్‌ జలాలు వదులుతామని మంత్రి తుమ్మల అన్నారు. ఎర్రగడ్డతండా వద్ద నిర్మిస్తున్న ఇన్‌టేక్‌వెల్ నిర్మాణాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. భక్త రామదాసు ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 557కోట్లు అవుతుందని, గత కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజీవ్‌ సాగర్, ఇందిరా సాగర్‌ కోసం కొన్న పైపులను, మోటార్లను ఈ పథకానికి  వినియోగిస్తుండగా.. రూ.100కోట్లు వెచ్చించటంతో పథకం పూర్తవుతుందని అన్నారు. ఈ పథకం తనకు వచ్చిన ఆలోచనేనని, తాను కోరగానే సీఎం అంగీకారం తెలపటం మంచి పరిణామమన్నారు. 33 కిలోమీటర్ల పైపులైన్‌ పూర్తయిందని, భారీ మోటార్లు బిగించారని, మిగిలిన పనులను అక్టోబర్‌ నాటికి పూర్తి చేసి నవంబర్‌లో సీఎం చేతులమీదుగా రైతులకు అంకితం చేస్తామని మంత్రి ప్రకటించారు. ఆయా సమావేశాల్లో మాజీ ఎమ్మెల్యేలు కొండబాల కోటేశ్వరరావు, వేనేపల్లి చందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, జెడ్పీటీసీ రాంచంద్రునాయక్, పాలేరు సర్పంచ్‌ రామసహాయం మాధవీరెడ్డి, ఎంపీటీసీలు వెంకన్న, విద్యాచందన, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ శ్రీనివాసరావు, భక్త రామదాసు ఎత్తిపోతల పథకం సీఈ సుధాకర్‌రావు, ఎన్నెస్పీ ఎస్‌ఈ కోటేశ్వరరావు, ఈఈ శ్యాంరావు, ఆర్డీఓ విజయ్‌కృష్ణారెడ్డి, తహసీల్దార్‌ వెంకారెడ్డి, నాగార్జున కనస్ట్రక్షన్ కంపెనీ ‌జీఎం శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.  



     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement