మహాప్రసాదాల వితరణకు అందజేసే జ్యూట్ బ్యాగులను ఆవిష్కరిస్తున్న ఈఓ, జెఈఓ, ప్రధానార్చకులు తదితరులు
ఆర్జిత సేవా భక్తులకు మెరుగైన సౌకర్యాలు
Published Fri, Sep 23 2016 12:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
– గర్భాలయ అభిషేక సేవాకర్తలకు రెండు మహాలడ్డూప్రసాదాలు
– ప్రత్యేకపూజాసేవల ప్రసాదాలు ఇక జ్యూట్ బ్యాగులలో
– భక్తులకు అందుబాటులో అమ్మవారి శ్రీచక్ర కుంకుమార్చన
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దేవస్థానంలో ఆర్జిత సేవాకర్తలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు ఈఓ నారాయణభరత్ గుప్త తెలిపారు. దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో కాన్ఫరెన్స్‌హాల్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరెంట్, అడ్వాన్స్ బుకింగ్ అభిషేకం టికెట్ ధర రూ. 1500లుగా నిర్ణయించిన విషయం తెల్సిందే కాగా, ఈ టికెట్లను తీసుకున్న సేవాకర్తలకు పూజా ద్రవ్యాలు, లడ్డూప్రసాదాలను ప్రత్యేకంగా తయారు చేయించిన జ్యూట్ బ్యాగులలో అందజేయాలని నిర్ణయించామన్నారు. అలాగే రూ. 5వేల గర్భాలయ అభిషేకం టికెట్ తీసుకున్న సేవాకర్తలకు పూజాద్రవ్యాలు, శ్రీశైలప్రభ, గోమయం విభూది, కంకణాల బాక్స్‌లతో పాటు 250 గ్రాముల చొప్పున రెండు మహాలడ్డూప్రసాదాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీశైలమహాక్షేత్రాన్ని సందర్శించడానికి వచ్చే వీఐపీలు, వీవీఐపీల కోసం ఆశీర్వచనాల అనంతరం వీరి కోసం ప్రత్యేకంగా రూపొందించిన జ్యూట్ బ్యాగులలో మహా ప్రసాదాలను అందజేస్తామని తెలిపారు. అలాగే లడ్డూప్రసాదాలను కొనుగోలు చేసిన భక్తులకు రూ. 20 చొప్పున జ్యూట్ బ్యాగులను విక్రయించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా ఏర్పడ్డ స్వయం సహాయక బృందాలకు చేయూతనివ్వాలనే సంకల్పంతో నంద్యాలకు చెందిన తేజలక్ష్మిగ్రూప్ (మెప్మా) వారు తయారు చేస్తున్న జ్యూట్‌బ్యాగులను వారి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు ఈఓ తెలిపారు. సమావేశంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, స్వామివార్ల ఫ్రధానార్చకులు పీఠం మల్లయ్యస్వామి, వేదపండితులు గంటి రాధకృష్ణమూర్తి, ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డి, శ్రీశైలప్రభ సంపాదకులు అనిల్‌కుమార్, సహాయ సంపాదకులు బ్రహ్మచార్య తదితరులు పాల్గొన్నారు.
డ్రై ఫ్రూట్స్ ప్రసాద వితరణపై ఆలోచన:l:
మల్లన్న భక్తులకు డ్రై ఫ్రూట్స్ ప్రసాదవితరణ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు ఈఓ తెలిపారు. వారం, పది రోజుల పాటు తీర్థయాత్రలపై వచ్చే భక్తులు, పర్యాటకులు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు లడ్డూప్రసాదాలు కొనుగోలు చేసినా నిల్వ సామర్థ్యం తక్కువగా ఉంటుందని, ఈ క్రమంలో డ్రై ఫ్రూట్స్‌పై ఆలోచిస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు అమ్మవారి శ్రీచక్ర కుంకుమ:
అమ్మవారి ఆలయంలో జరిగే శ్రీ చక్ర కుంకుమార్చన ద్వారా సేకరించిన కుంకుమను 150 గ్రాముల డబ్బాలో రూ. 50లు చొప్పున విక్రయించడానికి నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయాల ద్వారా స్వామిఅమ్మవార్ల లడ్డూప్రసాదాలతో పాటు విభూది, కుంకుమలు కూడా ఇక నుంచి తమ ఇళ్లకు తీసుకువెళ్లే సౌకర్యం కలిగిందన్నారు.
త్వరలో మీడియా ఫెసిలిటీ సెంటర్
శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే అన్ని కార్యక్రమాలను పత్రికలు, మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడానికి గంగా, గౌరి సదన్‌లోని ఒక దానిలో మీడియా ఫెసిలిటీ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఈఓ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెచ్‌డీ కెమెరాలను కూడా కొనుగోలు చేయాలని, అలాగే చిన్నపాటి స్టూడియో ఏర్పాటుపై కూడా చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement