యాత్రికులకు మెరుగైన సేవలు
నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి
నెహ్రూనగర్ : కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు మెరుగైన సేవలు అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. గోరంట్ల హోసన్నా మందిరం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర్ నగర్, పలకలూరు రోడ్డు, జేకేసీ కాలేజీ రోడ్డులో జరుగుతున్న పనులను మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాలు సమీపించనున్న నేపథ్యంలో పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పుష్కర్ నగర్ వద్ద భక్తులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్, వాహనాల రాకపోకలకు తగు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసుల సహాయ సహకారాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట అదనపు కమిషనర్ కృష్ణకపర్ధి, ఎస్‌ఈ గోపాలకృష్ణరెడ్డి, ఈఈ లక్ష్మయ్య, డీసీపీ సత్యనారాయణ, డీఈలు, ఏఈలు ఇతర సిబ్బంది ఉన్నారు.