
దొంగ ఓటర్లను చేరిస్తే కఠిన చర్యలు
ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్
తిరుపతి మంగళం :రాజకీయ నాయకులతో అధికారులు చేతులు కలిపి దొంగ ఓటర్లను చేరిస్తే కఠిన చర్యలు తప్పవని ఉమ్మడి రాష్ట్రాల ఎన్నికల కమిషనర్ భన్వర్‌లాల్ హెచ్చరించారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన యువతచే యుద్ధప్రాతిపదికన ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో శనివారం చిత్తూరు, వైఎస్సార్, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల ఎన్నికల అధికారులతో 2017 నాటికి ఓటర్ల జాబితా తయారీ.. 2017 శాసన మండలి ఎన్నికల్లో వివిధ కేసుల ఫిర్యాదులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జూన్ నుంచి బూత్ లెవల్ అధికారుల నియామకం చేపట్టి ఓటర్ల జాబితా సవరణ చేయాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఓటర్ల నమోదు సమగ్రంగా చేయాలన్నారు.
రాజకీయ నాయకుల చేతుల్లో కీలుబొమ్మలై దొంగ ఓటర్లను చేరిస్తే అధికారులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్ల జాబితా, పేర్ల నమోదు, తప్పులపై స్థానిక రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి మార్పులు చేర్పులు జరపాలని సూచించారు. 2018 జనవరి, 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి రాష్ట్రంలో ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. యువతకు అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వోలు రజియాబేగం, సుబ్రమణ్యేశ్వరరెడ్డి, దేవేందర్ రెడ్డి, తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయం ఏవో అబ్దుల్ మునాఫ్ పాల్గొన్నారు.