రైతులకు అండగా నిలిచేందుకే భరోసా యాత్ర
పత్తికొండ: ప్రభుత్వ చేయూత కరువై అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులకు అండగా నిలిచేందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారని ఆ పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసిల రఘురాం అన్నారు. శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా పత్తికొండలో ఆ నియోజకవర్గ ఇన్‌చార్జి కంగాటి లక్ష్మీనారాయణరెడ్డితో కలిసి స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వరుస కరువుతో రైతులు అల్లాడిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. బ్యాంకులతో పాటు ప్రై వేట్ వ్యక్తులు ఇచ్చిన అప్పుల కోసం ఒత్తిళ్లు చేస్తుండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో రైతులు పంట అప్పులతో ఆత్మహత్యలు చేసుకోవడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం చూస్తే ఆయనకు వారిపట్ల ఉన్న ఆదరణను తెలియజేస్తోందన్నారు. అందువల్లే రైతుల్లో ధైర్యం నింపే ఉద్దేశంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ భరోసా యాత్ర చేపట్టారన్నారు. అనంతపురం జిల్లాలో 75 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా.. జగన్‌మోహన్‌రెడ్డి ఆయా కుటుంబాలను కలిసి ఆత్మసై ్థర్యం కల్పించారన్నారు. కర్నూలు జిల్లాలోనూ ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శించేందుకు త్వరలోనే తమ పార్టీ అధ్యక్షుడు భరోసా యాత్ర పత్తికొండ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి శ్రీరంగడు, మండల కన్వీనర్ జూటూరు బజారప్ప, తదితరులు పాల్గొన్నారు.