ఓరి దేవుడా..
♦ 45 మందితో పొలతల క్షేత్రానికి బయలు దేరిన లారీ
♦ గువ్వల చెరువు ఘాట్‌లో బ్రేక్ ఫెయిల్
♦ అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లిన వైనం
♦ ఐదుగురు దుర్మరణం.. 40 మందికి తీవ్రగాయాలు
♦ ఘటన గురించి అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
‘అమ్మో.. నాయనో.. ఒరే చిన్నోడా ఎక్కడరా.. కిందకు దూకరా.. ఓరి దేవుడా.. ఇలా చేశావెందుకయ్యా.. కాపాడు స్వామీ..’ అంటూ ఆర్తనాదాలు, రక్షించండంటూ కేకలతో గువ్వల చెరువు ఘాట్ మారుమోగింది. ‘స్పీడ్ బ్రేకర్ వద్ద ఒక్కసారిగా ఎగిరి పడిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునేలోపే లారీ లోయలోకి పల్టీలు కొట్టింది. ఆ క్షణంలోనే ముగ్గురు విగతజీవులయ్యారు. తలలు పగిలి కొందరు, చేతులు.. కాళ్లు విరిగి మరికొందరు, మూగ దెబ్బలతో ఇంకొందరు విలవిల్లాడిపోయారు. మా బాధ వర్ణణాతీతం. లారీ పల్టీలు కొడుతుంటే ఒక్కరు కూడా బతకరనుకున్నా’మంటూ క్షతగాత్రులు కన్నీటి పర్యంతమయ్యారు.
చింతకొమ్మదిన్నె : బ్రేకులు ఫెయిలయ్యి లారీ అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయిన ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 40 మంది గాయపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం కడ ప-రాయచోటి రహదారిలోని గువ్వలచెర్వు ఘాట్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఘాట్ దద్దరిల్లింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. చిన్నమండెం ఏపీజీబీలో మేనేజర్‌గా పనిచేస్తున్న లక్కిరెడ్డిపల్లె మండలం నల్లగుట్టపల్లె గ్రామానికి చెందిన కోటి మల్లికార్జున్‌నాయుడు తన కుమార్తె మైథిలి (11 నెలలు) పుట్టు వెంట్రుకలను తీయించే వేడుకను పొలతల క్షేత్రంలో నిర్వహించాలనుకున్నారు. బంధు మిత్రులతో కలిసి సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నల్లగుట్టపల్లె నుంచి లారీ(ఏపీ04 టి 2765)లో బయలు దేరారు. ఉదయం 7 గంటలకు గువ్వల చెరువులో లారీని ఆపి అందరూ టీ తాగారు. 7.30 గంటలకు లారీ మూడవ ఘాట్ (కడపవైపు) వద్దకు చేరుకునే సరికి ఉన్నట్లుండి వేగం పెరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద కూడా ఆగక పోవడంతో లారీలో ఉన్న వారు కేకలు వేశారు. లోపల ఉన్న వారు ఏమైందంటూ డ్రైవర్‌ను ప్రశ్నించారు. ‘బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఏం చేయాలో తెలియడం లేద’న్నాడు. లారీని కొండ వైపు మళ్లించాలని లోపల ఉన్న వారు చెప్పేలోగానే లోయవైపు దూసుకుపోయింది. పల్టీలు కొడుతూ 100 అడుగుల లోయలో పడిపోయింది. లారీలో ఉన్న వారు ఎగిరి పడ్డారు.
కేకలు, ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. లక్కిరెడ్డిపల్లె మండలం చించర్ల గ్రామానికి చెందిన డి.చిన్నయ్య (40), నల్లగుట్టపల్లెకు చెందిన గుంటా మల్లమ్మ(60), అనంతపురం జిల్లా తలుపుల మండలం నిగిడి గ్రామానికి చెందిన గుండె మధుసూదన్‌నాయుడు (42) అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను 108, ఇతర వాహనాల్లో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్కిరెడ్డిపల్లె మండలం బి.ఎర్రగుడి గ్రామానికి చెందిన చిన్న గంగయ్య (60), కట్టా నారాయణ (60) మృతి చెందాడు. డ్రైవర్ ప్రక్కనే క్యాబిన్‌లో కూర్చొన్న మల్లికార్జున్‌నాయుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని రాయవేలూరుకు తరలించారు. ఘటనా స్థలాన్ని కడప డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, రూరల్ సీఐ వెంకట శివారెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ సభ్యుడు సుదర్శన్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. బాధితులను రిమ్స్‌కు తరలించడానికి సహకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు.
అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డితోపాటు స్థానిక వైఎస్సార్ సీపీ నేతలు ప్రమాద విషయం ఫోన్‌లో వివరించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లాలో రాయచోటి నుంచి కడపకు వెళ్లే దారిలో గువ్వలచెరువు ఘాట్ చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. ఇక్కడ ప్రమాదాలను నివారించాలని ఎన్నోమార్లు అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని విమర్శిం చారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఇందుకు రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు స్పందించి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామి ఇచ్చారు.
బతుకుతానని అనుకోలేదు
లారీ అదుపు తప్పిన సమయంలో డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్నాను. అతి వేగంగా వెళుతున్న వాహనాన్ని అదుపు చేయమని డ్రైవర్‌ను కోరాం. బ్రేకులు పడలేదంటూ డ్రైవర్ చేతులెత్తేయడంతో కొండవైపుకు లారీని తిప్పాలని కోరాం. అయితే ఆయన లోయ వైపునకు లారీని తీసుకెళ్లాడు. లోయలో లారీ పల్టీలు కొడుతూ కిందకు దూసుకుపోతున్న క్షణంలో ఇక బతుకుతానని అనుకోలేదు. పల్టీలు కొడుతున్న సమయంలోనే క్యాబిన్ లోంచి ఎగిరి బయటపడ్డాను. - గంగాధర్, నల్లగుట్టపల్లె
ఏమైందో తెలియలేదు ఒక్క సారిగా కుదుపు రావడంతో లారీలో వెనుక వైపు కూర్చొన్న మాకు ఏం జరిగిందో అర్థం కాలేదు. క్షణాల్లో లాలీ పల్టీలు కొడుతూ లోయలోకి దూసుకుపోయింది. ఒకరి మీద ఒకరం కిందా, మీద పడుతూ చెల్లా చెదురయ్యాం. అందరికీ రక్త గాయాలయ్యాయి. నేను చిన్నపాటి గాయాలతో బయటపడ్డాను. - రెడ్డికృష్ణ, నల్లగుట్టపల్లె