
కమలంలో మూడు ముక్కలాట
జిల్లా అధ్యక్ష పదవి కోసం తెర వెనుక కుమ్ములాట
రెండు వర్గాలు, మూడు గ్రూపులుగా పోటాపోటీ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఓ మంత్రి... ఓ ఎంపీ ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేని భారతీయ జనతాపార్టీ శ్రేణులు పార్టీ సారథ్య పదవి కోసం మాత్రం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నాయి. పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కోసం తెర వెనుక కుమ్ములాటలకు దిగుతున్నారు. సామాజికవర్గాలవారీగా నేతలు చీలి తమ వర్గానికే అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షుడిగా భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాసవర్మ వరుసగా ఆరేళ్ల నుంచి వ్యవహరిస్తున్నారు. ఆయన పదవీకాలం ఇటీవలే పూర్తి కావడంతో ఇప్పుడు సరికొత్త కమిటీని భర్తీ చేయాల్సి వచ్చింది. సరిగ్గా ఈ నేపథ్యమే పార్టీలో గ్రూపు, వర్గ రాజకీయాలకు తెరలేపింది.
రెండు సామాజిక వర్గాలు ఆ పదవి కోసం పోటీపడుతుండగా, పార్టీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయారు. జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల అధ్యక్ష పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందినవారే ఉండటంతో అదే వర్గానికి బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టాలన్న డిమాండ్ ఓ వర్గం నుంచి బలంగా వినిపిస్తోంది. ఆరేళ్లుగా బలమైన సామాజికవర్గానికి చెందిన శ్రీనివాసవర్మ కొనసాగడంతో ఈసారి తమకే అవకాశం ఇవ్వాలని మరో వర్గానికి చెందిన నేతలు పట్టుబడుతున్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే కోస్తా జిల్లాల్లో కులసమీకరణలు మారిపోయాయని ఆ వర్గం నేతలు లెక్కలు వేస్తున్నారు. కచ్చితంగా పశ్చిమలో తమ వర్గానికి చెందిన నేతకే జిల్లా సారధ్య పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అన్ని పదవులూ ఆ వర్గానికేనా?
వాస్తవానికి ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వర్గానికి చెందిన వారికే రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్సీ కోటాలో కూడా ఆ వర్గానికే చెందిన సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. జిల్లా అధ్యక్ష పదవికి కూడా అదే వర్గానికి కట్టబెడితే ఎలా అని పార్టీలో మరో వర్గం ఎదురు దాడిచేస్తోంది. పశ్చిమ పార్టీలో సామాజిక న్యాయం పాటించాలంటే తమ వర్గానికే మరోసారి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.
ఎవరిది పైచేయి అవుతుందో!
జిల్లాలో ప్రస్తుతం పార్టీ నేతలు మూడుగ్రూపులుగా విడిపోయారనేది పార్టీ కార్యకర్తలే అంగీకరించే వాస్తవం. ఎంపీ గోకరాజు గంగరాజు, మంత్రి మాణిక్యాలరావు పైకి ఒకే వర్గంలో ఉన్నట్టు కనిపిస్తున్నా.. ఇటీవలకాలంలో వీరిద్దరికీ దూరం పెరుగుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎంపీ గంగరాజు తన సోదరుడు, మాజీ డీసీసీ అధ్యక్షుడు గోకరాజు రామరాజుకి ఈసారి జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని అప్పగించాలని చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. అయితే మంత్రి మాణిక్యాలరావు తమ వర్గానికి చెందిన పాలకొల్లులోని మరోనేత పేరును సిఫార్సు చేస్తున్నటు చెబుతున్నారు. ఈ రెండువర్గాల ప్రతిపాదనలు ఇలా ఉండగా, ప్రస్తుత అధ్యక్షుడు భూపతిరాజు ఇటీవలే పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అండతో మరోసారి తనకే అవకాశం వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. కానిపక్షంలో తన వర్గానికి చెందిన నేతకు వచ్చేలా పావులు కదుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. జిల్లా రాజకీయాలపై ప్రభావం చూపే శక్తి లేనప్పటికీ కేవలం కేంద్రంలో అధికారంలో ఉండటం వల్లనే బీజేపీ నాయకులు జిల్లా సారధ్య పదవి కోసం ఎగబడుతున్నారన్న వాదనలు ఎవరు ఔనన్నా కాదన్నా వాస్తవం.