కమలనాథుల్లో కలవరం
అమిత్‌షా సభను భగ్నం చేసేందుకు మిత్రపక్షం యత్నాలు
కదలని శ్రేణులు.. కుదరని సమన్వయం
రైతు సభను విజయవంతం చేసేందుకు బీజేపీ నేతల పాట్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
తాడేపల్లిగూడెంలో బీజేపీ తలపెట్టిన రైతు మహాసభ కమలనాథులను కలవరపరుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అంశం పార్టీకి అనుకూలంగా మారిందని చెప్పుకుంటున్న బీజేపీ నాయకులు.. ప్రజల్లో అసంతృప్తి నెలకొనడంతో రైతు సభకు ఎంతమంది వస్తారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పాల్గొనే ఈ సభ విజయవంతం చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలకు మిత్రపక్షమైన తెలుగుదేశం నాయకులు ఎక్కడికక్కడ ఇబ్బందులు సృష్టిస్తున్నట్టు సమాచారం. గ్రామీణ రైతులను బీజేపీ సభకు వెళ్లవద్దంటూ కట్టడి చేస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంపీ గోకరాజు గంగరాజు సభ విజయవంతం కోసం ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఈ సభకు ఉభయ గోదావరి, గుంటూరు. కృష్ణా జిల్లాల నుంచి లక్ష మంది వస్తారని నేతలు చెబుతున్నారు. సభా ఏర్పాట్లు చేసిన విమానాశ్రయ రన్‌వే ప్రాంతం విస్తీర్ణం సుమారు ఐదు ఎకరాలు. ఇంటిలిజెన్స్ విభాగం అంచనాల ప్రకారం ఆ ప్రాంగణం మొత్తం నిండాలంటే 30 వేల మంది కావాలి. లక్ష మంది వస్తే ఎక్కడ కూర్చుంటారు. ఎక్కడ నిలబడతారనేది తెలియదు. రైతుల తరలింపునకు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను వినియోగిస్తున్నారు. దీని కోసం ఆయా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 200 బస్సుల చొప్పున వస్తాయని వైద్య ఆరోగ్యశాఖా మంత్రి కామినేని శ్రీనివాçస్ చెబుతున్నారు. ఈ సభ వల్ల రైతులకు మేలు కలుగుతుందని నాయకులు ప్రచారం చేస్తున్నారు.
చేసిందేమీ లేదు
ఇంతవరకు జిల్లాలో బీజేపీ తరఫున ఆయిల్‌పామ్ రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించడం మినహా జరిగిన ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ఎన్నికల సమయంలో హాట్‌గా వినిపించే కొల్లేరు కాంటూరు కుదింపు, జిరాయితీ భూముల సమస్యలు అమిత్‌షా ద్వారా కేంద్రానికి తీసుకెళతామని బీజేపీ నేతలు చెబుతున్నారు. రెండున్నరేళ్లలో వారు ఈ సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషి ఏమీ లేదు. ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి, చేపల రైతులకు మేలు చేకూర్చే విధంగా ఈ సభ ద్వారా నిర్ణయాలు ఉంటాయని చెబుతున్నారు. వేప పూత యూరియా, ప్రధాని ఫసల్ బీమా యోజన, సాయిల్ హెల్త్‌కార్డుల గురించి ఆ పార్టీ గొప్పగా చెప్పుకుంటోంది. ఈ ఫలాలు క్షేత్రస్థాయికి వెళ్లిన దాఖలాలు తక్కువ. భీమవరంనరసాపురం నియోజకవర్గాల మధ్య తుందుర్రులో కేంద్రం ఇచ్చే సబ్సిడీతో నిర్మిస్తున్న గోదావరి మెగా అక్వాఫుడ్ పార్క్‌ను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ నేతలు ప్రజల పక్షాన నిలబడకపోవడంతో ఆయా ప్రాంతాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ ఫ్యాక్టరీ వల్ల నష్టం లేదని ఎంపీ గోకరాజు గంగరాజు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ ప్రాంత వాసులు అతని దిష్టిబొమ్మను దహనం చేశారు. పార్టీకి జిల్లాలో ఉన్న బలం దృష్ట్యా చూస్తే జనసమీకరణ కష్టమనే వాదన వినిపిస్తోంది. మంత్రిగా ఉన్నా మాణిక్యాలరావు ఎన్నడూ పార్టీ అభివృద్ధికి చేసిన కృషి ఏమీ లేదు. మరోవైపు రైతు సభ అని పెట్టినా రైతులకు చేసిన ఉపకారం కూడా ఏమీ లేదు. రైతు రుణమాఫీని ఇక్కడి అధికార తెలుగుదేశం పార్టీ అమలు చేయకపోయినా, మిత్రపక్షంగా రైతుల పక్షం వహించి మాట్లాడింది కూడా లేదు. రైతులు సభకు వచ్చే అవకాశం ఉన్నా, సమీకరించే యంత్రాంగం బీజేపీకి లేదు. సన్నాహక కార్యక్రమాలలో కాని, కార్యక్రమాన్ని గ్రామాల స్థాయికి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందిందనే విమర్శలు ఉన్నాయి. ఈ సభ విజయవంతం కోసం దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో రెండుసార్లు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించగా, 150 వాహనాలకు మించి రాలేదు. శుక్రవారం ఉదయం వరకు ప్రాంగణాన్ని పరిశీలించడం, నాయకుల ప్రకటనలు. ప్రెస్‌మీట్లతోనే ప్రచారం చేసేశామనే భావనలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు భగ్గుమన్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం నేతలు కూడా బీజేపీపై మండిపడుతున్నారు. ఇంత ప్రతికూల పరిస్థితుల మధ్య అమిత్‌షా పర్యటన ఎలా సాగుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.