వ్యవసాయశాఖలో 'బయో' వణుకు!
– ఆరుగురు అధికారులపై వేటు?
– బయోలతో లింకులే కారణం
– ఆధారాలతో సహా నివేదించిన విజిలెన్స్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వ్యవసాయశాఖలో వణుకు మొదలయ్యింది. మొన్నటి వరకు బయో కంపెనీలతో చెట్టాపెట్టాలేసుకుని తిరిగి... రైతుల అమాయకత్వంతో వ్యాపారం చేసిన వ్యవసాయశాఖ అధికారులపై వేటు పడనుంది. ప్రధానంగా బయో కంపెనీలతో సంబంధాలతో పాటు ఏకంగా ఆ కంపెనీలల్లో వాటాదారులుగా ఉన్న జిల్లాలోని ఆరుగురు వ్యవసాయశాఖ అధికారులపై సస్పెన్షన్ వేటుపడనుంది. అంతేకాకుండా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమయ్యింది. రైతులకు వ్యవసాయ సూచనలు ఇచ్చి, వారికి చేదోడుగా నిలవాల్సిన వ్యవసాయశాఖ అధికారులు కొద్ది మంది.. ఇందుకు భిన్నంగా పంటలను సర్వనాశనం చేసే బయో కంపెనీలకు అండగా నిలవడం ఇప్పుడు ఆ శాఖలో చర్చనీయాంశమయ్యింది. వీరందరిపై ఆధారాలతో కూడిన అభియోగాలు ఇప్పటికే వ్యవసాయశాఖకు చేరాయి. దీని ఆధారంగా వీరిపై వేటు పడనుంది. తమ పరిధిలో బయో వ్యాపారం విచ్చలవిడిగా జరుగుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండటమే కాకుండా ఎటువంటి తనిఖీలు వీరు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆ ఆరుగురు వీరే...!
బయో కంపెనీలతో ఆర్థిక సంబంధాలు నెరిపిన ఆరుగురు వ్యవసాయ అధికారులను ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇందుకు అనుగుణంగా ఏయే అధికారులు ఏయే బయో కంపెనీలతో సంబంధాలు నెరిపారనే అంశాలతో కూడిన నివేదికను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు అందజేసినట్టు తెలిసింది. విజిలెన్స్ నివేదిక నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రధాన కార్యాలయం నుంచి కూడా మరో అధికారి వచ్చి విచారణ కూడా జరిపారు. ఈ నేపథ్యంలో సదరు ఆరుగురు వ్యవసాయశాఖ అధికారులపై త్వరలో వేటు పడనుంది. స్వయంగా వ్యవసాయశాఖ డైరెక్టర్ కూడా బయో కంపెనీలతో సంబంధాలు పెట్టుకుని నకిలీ పురుగు మందులతో రైతులను మోసం చేయడంతో పాటు...ఆ పంటను మనం కూడా తింటామన్న కనీస స్పృహ లేకుండా వ్యవహరించారని కొద్దిరోజుల క్రితం జరిగిన సమావేశంలో మండిపడ్డారు. ఇక్కడి అధికారులకు బయో కంపెనీలతో సంబంధాలు ఉన్నట్టు కూడా తేలిందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో సదరు అధికారుల్లో వణుకు మొదలయ్యింది. వేటు పడనున్న వారిలో....
-
ప్రధాన నగరానికి సమీపంలోనే ఉండే మండల అధికారి ఉన్నారు.
-
వేగంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందుతున్న మండలానికి చెందిన వ్యవసాయ అధికారి.
-
కర్నూలు నగరానికి 30–40 కిలోమీటర్ల పరిదిలో ఉండే మరో అధికారి.
-
జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిజినెస్ సెంటర్‌లో పనిచేసే అధికారి.
-
మరో ఇద్దరు ఈ వ్యవహారాల్లో పేరు మోసిన వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు.
ఈ ఆరుగురిపై త్వరలో వేటు పడనుంది. అయితే, తమపై వేటు పడకుండా పలువురు.. అధికార పార్టీ నేతలను కూడా కలిసి పైరవీలు చేసుకుని కాపాడమని కోరుతున్నట్టు తెలిసింది. ప్రధానంగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలతో సిఫార్సులు చేయిస్తున్నట్లు సమాచారం.