పంచాయతీల్లోనూ బయోమెట్రిక్
జిల్లాలో విడతల వారీగా అమలు
– గ్రామ స్థాయి అధికారులందరికీ పంచాయతీ కార్యాలయంలోనే హాజరు
– ఉపాధ్యాయులకూ అక్కడే..
– 369 పంచాయతీలు లక్ష్యం
– ఇప్పటికే 60 చోట్ల ఏర్పాట్లు పూర్తి
కర్నూలు(సిటీ):
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలోనూ బయోమెట్రిక్ హాజరుకు శ్రీకారం చుడుతోంది. ఇప్పటి వరకు ఈ విధానం మండల స్థాయికే పరిమితం. తాజా ఉత్తర్వులతో పంచాయతీ పరిధిలోని ఉద్యోగులంతా పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న బయోమెట్రిక్ యంత్రంలో హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో గైర్హాజరుగా భావించి ఆ రోజు వేతనం కోత వేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఈ బయోమెట్రిక్ విధానంపై తీవ్ర వ్యతిరేఖత ఉన్నా.. ప్రభుత్వం లెక్క చేయకుండా గ్రామ స్థాయిలోనూ ఏర్పాటు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
369 పంచాయతీల్లో అమలు
జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు.. 1,498 గ్రామాలు ఉన్నాయి. గ్రామస్థాయిలో పనిచేసే అన్ని శాఖల అధికారులను ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ను తెరపైకి తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 369 గ్రామ పంచాయతీలను బయోమెట్రిక్ అమలుకు ఎంపిక చేశారు. మొదటి విడతగా ఇప్పటికే 60 గ్రామ పంచాయతీల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశారు. నేడో రేపో మరో 169 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఈ ఏడాది 369 గ్రామ పంచాయతీల్లో ఈ విధానం అమలు చేయాలని లక్ష్యంగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలను డిజిటల్‌గా తీర్చిదిద్దేందుకు జిల్లాలోని దాదాపు అన్ని పంచాయతీలకు కంప్యూటర్లు అందజేశారు. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ విధానానికి ఆ కంప్యూటర్లు ఉపయోగపడనున్నాయి. వీటిని అదనంగా వేలిముద్రలు వేసేందుకు అవసరమైన పరికరాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల ఈ పరికరాలు పనిచేయకపోవడంతో కొంత జాప్యం జరుగుతుండటంపై ఆయా మండల అధికారులపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
అధికారులందరికీ అక్కడే హాజరు
పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్న బయోమెట్రిక్ యంత్రంలో అక్కడ పని చేస్తున్న వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర పంచాయతీ సిబ్బంది.. ఆయా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు సైతం పంచాయతీ కార్యాలయానికి వచ్చి హాజరు తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఆయా పంచాయతీల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, దేవాదాయ శాఖ, అంగన్‌వాడీ టీచర్లు, విద్యుత్ శాఖ లైన్‌మన్ కూడా పంచాయతీలోనే బయోమెట్రిక్ హాజరు తీసుకోవాల్సి రానుంది.