ఓపిక లేకున్నా ఉద్యోగానికి ఎందుకెళ్తారో తెలుసా?
లండన్: ఆరోగ్యం బాగోలేకపోయినా, ఒంట్లో సత్తువ లేకున్నా కొన్ని భయాల కారణంగానే నేటి తరం ఉద్యోగాలకు వెళ్తున్నారని ఓ అధ్యయనం తెలిపింది. అందులో ప్రధాన కారణాలుగా ఉద్యోగాలకు భారీ స్థాయిలో డిమాండ్ ఉండటం, ఒత్తిడి, అభద్రతా భావం, వ్యక్తిగతంగా ఆర్థిక సమస్యలు వారిని విధుల నిర్వహణకు గైర్హాజరు కాకుండా చేస్తాయట.
అసలు కొంతమంది వ్యక్తులు చిన్న జబ్బులు చేసినా, రోగంతో బాధపడుతున్నా అవన్నీ పట్టించుకోకుండా ఎందుకు ఉద్యోగానికి వెళుతుంటారో అని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా అనే విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మారియెల్లా మిరాగిలియా ప్రత్యేక అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో భాగంగా పై మూడు కారణాలు గుర్తించిన ఆయన ఫలితాలు కూడా వివరించారు.
'ఆరోగ్యం బాగాలేనప్పుడు పనిచేస్తుండటం వల్ల ఏ పని చేస్తున్నామో దానిపై ప్రతికూల దృక్పథం ఏర్పడే ప్రమాదం ఉంది.పనిమధ్యలో విరమించుకునే అవకాశం కూడా ఉంది. ఇవి తెలిసినా కూడా చాలా మంది ఉద్యోగులు అలాగే తమ విధులకు హాజరవుతుంటారు. అయితే, ఇలా చేయడం కొందరికి స్ఫూర్తి దాయకంగా కనిపిస్తుంటుంది. మరింత ముందుకు వెళ్లేలా పనిచేయాలని అవతలివారికి అనిపిస్తుంది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా విధులు తప్పక నిర్వర్తించాలనే బాధ్యతను గుర్తు చేస్తుంటుంది' అని ఆయన తెలిపారు. ఈ అధ్యయనం కోసం ఆయన మొత్తం 61 అధ్యయనాలు పూర్తి చేశారు. ఈ అధ్యయనాల్లో మొత్తం 1,75,960మంది పాల్గొన్నట్లు తెలిసింది.