దొంగలకూ 'భయో' మెట్రిక్..! | biometric for thieves in chittoor district | Sakshi
Sakshi News home page

దొంగలకూ 'భయో' మెట్రిక్..!

Published Sat, Jun 4 2016 9:37 AM | Last Updated on Tue, Aug 28 2018 7:30 PM

దొంగలకూ 'భయో' మెట్రిక్..! - Sakshi

దొంగలకూ 'భయో' మెట్రిక్..!

ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల్లోని సిబ్బంది, విద్యార్థుల హాజరు శాతం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ యంత్రాలు ఇప్పుడు దొంగలకు సైతం వాడనున్నారు. క్రిమినల్స్ డిటెన్షన్ సిస్టమ్ (సీడీఎస్) పద్దతిని జిల్లా కేంద్రమైన చిత్తూరులో ప్రయోగాత్మకంగా ఉపయోగించనున్నారు.
 
 చిత్తూరు : సాధారణంగా బయోమెట్రిక్ యంత్రాలను ఉద్యోగుల హాజరు శాతానికి ఉపయోగిస్తుంటారు. ఇటీవల నిత్యావసర వస్తువుల పంపిణీ, అంగన్‌వాడీ కేంద్రాల్లో హాజరు శాతం తదితర వాటికి సైతం వాడుతున్నారు. ఇప్పడు దొంగలకు కూడా బయోమెట్రిక్ పరికరాలను ఉపయోగించనున్నారు.  పోలీసుల బయోమెట్రిక్ యంత్రాలను ఉపయోగిస్తూ పాత నేరస్తులను పట్టుకోనున్నారు.
 
ఆన్‌లైన్‌లో వివరాలు..
 పొలాల్లోని మోటార్లకు ఉన్న వైర్లను చోరీ చేయడం, తాళాలు వేసిన ఇళ్లను పగులగొట్టి చోరీలు చేయడం, ద్విచక్రవాహనాల చోరీ, చైన్ స్నాచింగ్ జిల్లాలో ఎక్కువ సంఖ్య లో జరిగే చోరీలు ఇవే. పోలీసు స్టేషన్లలో నమోదవుతున్న నేరాల్లో ఇవి 40 శాతానికి పైనే ఉన్నాయి. ఈ నేరాలను చోరీలకు అలవాటు పడిన పాత నేరస్తులే ఎక్కువగా చేస్తున్నారు. వీరికి చెక్ పెట్టడానికి ఇటీవల జిల్లా పోలీసులు సీడీఎస్ అనే సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఇటీవల చిత్తూరుకు వచ్చిన డీజీపీ ఈ కొత్త వ్యవస్థను ప్రారంభించి, సీడీఎస్ కోసం ఐదు కొత్త ట్యాబ్‌లను సైతం అందజేశారు. ఈ ట్యాబ్‌ల్లో ఐదేళ్ల కాలంలో జిల్లాలో జరిగిన చోరీలు, పిక్‌పాకెటింగ్‌లకు సంబంధించిన 1860 మంది నేరస్తుల వేలి ముద్రలను నిక్షిప్తం చేశారు. వీటన్నింటినీ సీడీఎస్‌కు అనుసంధానం చేశారు.
 
ముద్ర పడితే తెరపై బొమ్మ...
రాత్రి పూట గస్తీలో ఉన్న పోలీసులు పాత నేరస్తుల ఉనికి గుర్తించడానికి, వాళ్ల మదిలో ఉన్న నేరప్రవృత్తి ఆలోచలను ముందస్తుగా పసిగట్టడానికి ట్యాబ్‌లను ఉపయోగించనున్నా రు. అనుమానితులు రాత్రులు, నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతుంటే పోలీసులను వాళ్లను పిలిచి ముందుగా పేరు అడుగుతారు. దొంగ తన పేరు మురళి అని చెప్పి తప్పించుకోవడానికి చూస్తే వెంటనే అతని వేలి ముద్ర సేకరిస్తారు. సీడీఎస్‌లో నిక్షిప్తమైన సమాచారంలో పాత నేరస్తుడి పేరు రాజేష్ అని చూపిస్తుంది. దీనికి తోడు జిల్లాలో అతనిపై ఏయే పోలీసు స్టేషన్లలో కేసులు ఉన్నాయి? ఎక్కడ శిక్షలు పడ్డాయి? అనే అన్ని వివరాలు, ఫొటో తెరపై ప్రత్యక్షమవుతుంది. దీంతో వారిని అరెస్టు చేసే వీలు ఉంటుంది. అన్నీ పనులు త్వరగా పూర్తయితే జూన్ తొలి వారంలో ఈ పద్ధతిని జిల్లా కేంద్రంలో అమలు చేస్తారు. దశల వారీగా జిల్లా మొత్తం ఈ పద్ధతిని వినియోగించడాని పోలీసు శాఖ సిద్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement