కోట పులకించింది
గోల్కొండ: చారిత్రక గోల్కొండ కోట తొలిసారి పూలవనమై పులకించింది. ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలతో పరవశించింది. గుమ్మడి పూలో.. అమ్మ.. బంతీపూలో.. తంగెడపూలో తల్లి.. ఎంగిలిపూలో.. అంటూ సాగిన జానపదాలు కొండ గాలితో కలిసి నగరాన్ని చుట్టేశాయి. రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం కోటలో బతుకమ్మ వేడుకలు అద్భుతంగా నిర్వహించారు.
రకరకాల పూలతో కూర్చిన బతుకమ్మలను ప్రాంగణంలో ఉంచి.. చక్కని పాటలకు మహిళా నేతలంతా లయబద్దంగా కదులుతుంటే.. వారితో కలిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం పాదం కలిపారు. ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు జి.పద్మజారెడ్డి తదితరులు బతుకమ్మ ఆడారు.