► రెవెన్యూ అధికారికి బ్లాక్‌మెయిలింగ్ లెటర్
► ఫేవర్ చేయాలంటే నగదు చెల్లించాలని కోరిన వైనం
► గట్టు శివానంద పేరుతో ఖాతా నంబర్ పంపిన సంఘటన
► లెటర్‌పై ఏసీబీ డీఎస్పీకి వీఆర్వో ఫిర్యాదు
బుచ్చిరెడ్డిపాళెం: ‘క్లరికల్ క్యాడర్ వ్యక్తిని నేను. నీపై ఆరోపణలతో కూడిన ఫైల్ నా వద్ద ఉంది. నీకు ఫేవర్ కావాలంటే నేను పంపుతున్న ఖాతా నంబర్‌లో రూ.30 వేలు జమచేయ్. లేకుండా నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ నందకిషోర్‌కు పట్టిన గతి నీకూ పడుతుంది’. అంటూ ఓ వ్యక్తి మండలంలోని పెనుబల్లి గ్రామ రెవెన్యూ అధికారికి పంపిన బ్లాక్‌మెయిలింగ్ లెటర్ సంచలనం సృష్టిస్తోంది. దీనిపై సదరు వీఆర్వో ఏసీబీ డీఎస్పీని ఆశ్రయించగా, విచారణ జరుపుతామని తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం ఎస్సైకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించారు. అంతేకాకుండా లెటర్‌లో ఉన్న చిరునామాకు వీఆర్వోనే వెళ్లి విచారణ జరిపి వ్యక్తి ఉంటే తనకు తెలియజేయాలని ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి ఉచిత సలహా ఇచ్చిన ఉదంతమిది.
వివరాల్లోకి వెళ్లితే...
మండలంలోని పెనుబల్లి వీఆర్వోకు ఈనెల 25న పోస్ట్ ద్వారా ఓ లెటర్ వచ్చింది. అందులో వీఆర్వో పేరును సంబోధిస్తూ రాసి ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. ‘నేను పనిచేసేది క్లరికల్ క్యాడరే అయినా మీకు సంబంధించినంతవరకు కీలకస్థానమే. పవన్‌కుమార్ రెడ్డి అనే వ్యక్తి మీపై ఆరోపణలు చేస్తూ అందుకు తగిన ఆధారాలు పంపాడు. ఆ ఫైల్ ఇప్పుడు నా వద్ద ఉంది. నేను ఎక్కడ పనిచేస్తాననేది ముఖ్యం కాదు. ఆరోపణల పర్యవసానం ముఖ్యం. మీకు ఫేవర్ చేద్దామనే ఆపాను. మీపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో నాకు అనవసరం. మీకు ఫేవర్ చేసినందుకు రూ.30 వేలు ఆశిస్తున్నాం. మాకు పొలిటికల్ బ్యాకప్ ఉంది. మీ సహకారం మాకు అవసరం లేదు అని అనుకుంటే మీ ఇబ్బందులు మీరు పడవచ్చు. మీరు మనీ పే చేయాల్సిన అవసరం లేదు. రొటీన్ ప్రాసెస్‌లాగా మీ ఫైల్ టేబుల్ అవుతుంది.
తరువాత ట్రాప్‌కు కావాల్సిన విక్టిమ్‌ను రెడీ చేసుకుని మీ బినామీల గురించి ఆరాతీసిన తరువాత చర్యలుంటాయి. ఉదాహరణకు నెల్లూరు సబ్‌రిజిస్ట్రార్ నందకిషోర్, పంచాయతీరాజ్ డీఈఈలపై ఫిర్యాదులు వచ్చాయి. ఇద్దరినీ అప్రోచ్ అయ్యాను. డీఈఈ మనీ పేచేశారు. ఫైల్ మాయం చేశాం. సబ్‌రిజిస్ట్రార్ లైట్ తీసుకున్నాడు. దాంతో మేం ఫిబ్రవరి 22వ తేదీన ఫైల్ టేబుల్ చేశాం. ఈ నెల ఫస్ట్‌వీక్ అతనిపై రైడ్ జరిగి, సస్పెండ్ అయి ౖజñ ల్లో ఉన్నాడు. ఒకటి మాత్రం నిజం మీపై ఎలిగేషన్స్ తీవ్రంగా ఉన్నాయి. మా ఫేవర్ కావాలంటే పైసలు పే చేయండి,అలాకాకుండా నన్నే మనీ పే చేయమంటారా అంటూ బద్‌నామ్ చేయాలని చూస్తే మీకే నష్టం. మా జాగ్రత్తలో మేముంటాం. మీరు 28,29వ తేదీల్లో మనీ పే చేసేటట్లయితే గట్టు శివానంద, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఖాతానంబరు 20310 467791లో పే చేయండి. అంటూ లెటర్‌ను వీఆర్వోకు పంపారు’.
ఏసీబీని ఆశ్రయించిన వీఆర్వో:
తనకు వచ్చిన బ్లాక్‌మెయిలింగ్ లెటర్‌పై వీఆర్వో ఏసీబీ డీఎస్పీని బుధవారం ఆశ్రయించారు. లెటర్‌ను చూపారు. తిరుపతిలో ఉన్న తమ శాఖ అధికారుల ద్వారా సమాచారం సేకరిస్తామని తనకు హామీ ఇచ్చినట్లు వీఆర్వో తెలిపారు.
ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయని ఎస్సై:
తనపై వచ్చిన బ్లాక్ మెయిలింగ్ లెటర్‌పై ఆర్‌ఐలు, వీఆర్వోలతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వీఆర్వో ఫిర్యాదు చేసినా ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి కేసు నమోదు చేయలేదు. ఇవ్వన్నీ ఫేక్ లెటర్స్ అని కొట్టిపడేశారు. ఆ చిరునామాలో ఉంటే తదుపరి చర్యలు తీసుకుంటానని ఎస్సై వేణుగోపాల్‌రెడ్డి ఉచిత సలహా ఇచ్చారు.