
సక్కగా పోవాలే... గిదేం రాళ్లేసుడు!
పార్టీ మారాలనుకుంటే లేదా పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే పోనీ...కానీ, అనవసరంగా ఎవరినో ఒకరిని వివాదాల్లోకి లాగడమేంటని కాంగ్రెస్ ప్రముఖుడొకరు వాపోతున్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడటం తప్పైతే, దానిని కప్పిపుచ్చుకోవడానికి ఎవరి మీదనో నెపం వేయడం ఫ్యాషన్ అయిందంటూ ఆయన ఆవేదన చెందుతున్నారు. పార్టీలో పదవులు అనుభవిస్తున్నప్పుడు గుర్తుకు రానివన్నీ పార్టీని వీడేటప్పుడే ఎందుకు గుర్తు వస్తాయంటూ ఆయన మధనపడిపోతున్నారు. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ ఆయన రాజకీయ గురువు బాటలో పయనించబోతున్నారని చాలా కాలం కిందటే ఊహాగానాలు వెలువడ్డాయి.
కానీ, ఆయన ఎక్కడా వాటికి ఆస్కారం ఇవ్వలేదు. హఠాత్తుగా పార్టీలో తనను పట్టించుకోవడం లేదని బాహటంగా ఆరోపణలను దిగడంతో ఆయన పార్టీ మారడానికి ఏవో సాకులు వెతుక్కుంటున్నారని వ్యతిరేకులు అంటున్నారు. ఏదైనా కానీయండి పోతూ పోతూ ఇతరులపై బండరాళ్లు వేయడమే మంచి సాంప్రదాయం కాదని ఓ కాంగ్రెస్ ప్రముఖుడి హితవు చెప్తున్నారు.