రక్తపోటు నిశ్శబ్ద మృత్యువు
రక్తపోటు నిశ్శబ్ద మృత్యువు
Published Sun, Aug 14 2016 8:36 PM | Last Updated on Wed, Apr 3 2019 4:37 PM
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్
తెనాలి : నిశ్శబ్ద మృత్యువుగా అభివర్ణించే అధిక రక్తపోటు తగిన జాగ్రత్తలతో జీవితాన్ని గడపొచ్చని ప్రసిద్ధ అంతర్జాతీయ అధిక రక్తపోటు రుగ్మత నిపుణుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సి.వెంకట ఎస్.రామ్ పేర్కొన్నారు. వాకర్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సదస్సుకు క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ‘అధిక రక్తపోటు– తీసుకోవాల్సిన జాగ్రత్తలు’ అంశంపై డాక్టర్ వెంకట ఎస్.రామ్ మాట్లాడారు. గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల జబ్బు, మతిమరుపు మొదలైన సమస్యలకు అధిక రక్తపోటు కారణమవుతుందని చెప్పారు. ఎలాంటి లక్షణాలు లేకుండా అధిక రక్తపోటు కొన్ని సంవత్సరాలపాటు పెరిగి, అనేక సమస్యలకు దారితీస్తుందని చెప్పారు. దీనిని సైలెంట్ కిల్లర్ అంటారని వ్యాఖ్యానించారు. తలనొప్పి, తలతిరగడం, ముక్కు నుంచి రక్త స్రావం వంటి లక్షణాలకు, అధిక రక్తపోటుకు సంబంధం లేదనీ, గురకవ్యాధికి, అధిక రక్తపోటుకు సంబంధం ఉందన్నారు. తరచుగా పరీక్షలు చేయించుకుంటూ వైద్యుడి సలహా ప్రకారం మందులు ఆపకుండా వాడాలని సూచించారు. ఉప్పు వాడకం తగ్గించాలనీ, మనిషికి 2–3 గ్రాముల ఉప్పును మాత్రమే వాడాలని చెప్పారు.
Advertisement