రవాణాశాఖ ఉప కార్యాలయం ఇదే
–ప్రతి పనికి పైసలిచ్చుకోవాల్సిందే..
–అమర్యాదగా ప్రవర్తిస్తున్న మహిళా ఉద్యోగులు
– చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
పాత శ్రీకాకుళం: జిల్లా ఉప రవాణా శాఖ కార్యాలయంలో దళారుల రాజ్యం సాగుతోంది. ఇటీవల డీటీసీగా బాధ్యతలు చేపట్టిన అధికారి దళారులను కార్యాలయం దరిదాపులకు రాకుండా చూశారు. ఇది కొద్దిరోజులపాటు అమలైంది. ఇప్పుడు మళ్లీ హవా సాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల రణస్థలానికి చెందిన ఓ వ్యక్తి తన వాహనాన్ని అమ్మకానికి పెట్టాడు. వాహనానికి సంబంధించిన అన్ని కాగితాలు ఉన్నప్పటికీ దానిని వేరే వ్యక్తి పేరిట ట్రాన్‌ఫర్ చేసేందుకు తీసుకోవాల్సిన పర్మిట్ కాగితాల కోసం పైసలు చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆర్టీఓ కార్యాలయం వద్ద ఉండే ఓ దళారీని ఆశ్రయించాడు. వెంటనే ఆయన రవాణాశాఖ అధికారిని సంప్రదించడంతో భారీ మోతాదుల్లో పైకం తీసుకుంటూ రెండు రోజుల్లో చేయాల్సిన పనిని గంటలోనే పూర్తిచేసి పంపేసినట్టు సమాచారం.
ప్రతి పనికీ పైస లిచ్చుకోవాల్సిందే...
జిల్లా ఉప రవాణాశాఖ కార్యాలయంలో ప్రతి పనికి లంచం ఇచ్చుకోవాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ద్విచక్ర వాహనాలతో పాటు కార్లుకు ఆయా షోరూంలలో రిజిస్ట్రేషన్ చేస్తోంది. ఈ పనులకు తప్ప మిగతా పనులన్నీంటికీ అదనంగా పైకం (లంచం) చెల్లించుకోవాల్సిందే.
మర్యాద అనే పదం తెలియని మహిళా ఉద్యోగులు...
ఇదిలావుండగా కార్యాలయంలో వివిధ కౌంటర్‌లలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు అమర్యాదగా మాట్లాడుతున్నారని కార్యాలయానికి వివిధ పనులపై వచ్చిన వారు వాపోతున్నారు. రెండు రోజుల కిందట 9,10 కౌంటర్‌లో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగినికి ఎల్‌ఎల్‌ఆర్‌కు సంబంధించి కౌంటర్ స్లిప్‌లో తప్పు పడడంతో దానిని మార్చాలని ఓ వ్యక్తి కోరాడు. దీంతో ఆయనపై అమర్యాదగా ఎన్నో మాటలు విసిరేసింది. ఆయన ఏమి చేయలేక మిన్నకుండిపోయారు.
నాదృష్టికి రాలేదు.. సరిచేస్తాం
కార్యాలయంలో దళారులను పూర్తిస్తాయిలో నియంత్రించాం. మళ్లీ ఇలా జరుగుతుందంటే కార్యాలయ సిబ్బందితో మరోసారి సమావేశమవుతాం. మహిళా ఉద్యోగులందరూ కార్యాలయానికి వచ్చేవారితో మర్యాదగా మాట్లాడాలి. లేకుంటే తగిన చర్యలు తీసుకుంటాం.
–శ్రీదేవి, డీటీసీ