ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం కలిగించండి
ప్రభుత్వాస్పత్రులపై నమ్మకం కలిగించండి
Published Sun, Oct 23 2016 12:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
మనుబోలు : ప్రభుత్వాస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌ఓ వరసుందరం వైద్యులు, సిబ్బందికి సూచించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిలో 60 శాతం మంది వైద్యులు మాత్రమే కచ్చితమైన సమయానికి హాజరవుతున్నారని, మిగిలిన 40 శాతం మంది సమయ పాలన పాటించడం లేదన్నారు. కొత్తగా వైద్యుల హాజరు కోసం టెలిగ్రామ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సకాలంలో వైద్యులు వస్తేనే ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుందన్నారు. పీహెచ్‌సీల్లో కాన్పుల సంఖ్యను పెంచాలన్నారు. స్వచ్ఛభారత్ భాగంగా వివిధ శాఖల అధికారులు ఐదుగురు బృందంగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్లి దోమల నివారణ, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. పారిశుద్ధ్యానికి నిధుల కొరత లేదన్నారు. వీధుల్లో ఎక్కడైనా చెత్తా చెదారం కుప్పలు ఉన్నట్లైతే వాటిని ఫొటోలను ఆయా పరిధిలోని ఆర్డీఓ, వీఆర్వోలకు పంపితే వెంటనే చర్యలు తీసుకుంటారన్నారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆయన వెంట వైద్యులు విష్ణురావు, రమేష్, విజయలక్ష్మి, పీహెచ్‌ఎన్ నజీమున్నీసా, సిబ్బంది లలితమ్మ, రాజేష్, రాజన్ పాల్గొన్నారు.
Advertisement