నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
-
వైద్య సిబ్బందిపై డీఎంహెచ్‌ఓ ఆగ్రహం
కొడవలూరు : దోమల నివారణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకొంటానని డీఎంహెచ్‌ఓ వరసుందరం హెచ్చరించారు. మండలంలోని కొడవలూరు, రామన్నపాలెం సబ్‌సెంటర్లను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కొడవలూరు మూలకట్ల సంఘం సబ్‌సెంటర్ వెనుకనే దోమల ఉత్పత్తికి కారణమైన లార్వా ఉండడాన్ని ఆయన గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లార్వా నివారణ పట్ల వైద్య సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. సబ్‌సెంటర్లున్న ప్రాంతాల్లోనే లార్వా నిల్వలుంటే ఇక ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో పరిస్థితేమిటని ప్రశ్నించారు. దోమల నివారణా చర్యల్లో విఫలమైన వైద్య సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొంటానని హెచ్చరించారు. వైద్య సిబ్బంది ప్రతి రోజూ నాలుగు గ్రామాల్లో పర్యటించి అబెట్ మందు చల్లి లార్వాను నివారించాలన్నారు. తనిఖీల్లో ఇది అమలు కావడంలేదని తేలితే మాత్రం కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ఆయన వెంట వైద్యాధికారిణి కుసుమ, హెచ్‌ఏ షఫీ ఉద్దీన్, ఏఎన్‌ఎంలు ఎస్తేరమ్మ, జయశీల తదితరులున్నారు. l